Telugu Gateway
Movie reviews

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీ రివ్యూ

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీ రివ్యూ
X

సమ్మర్ సీజన్ లో ఇప్పటికే రెండు టాలీవుడ్ సినిమాలు దమ్మురేపాయి. అందులో ఒకటి రామ్ చరణ్ రంగస్థలం అయితే..మరొకటి మహేష్ బాబు ‘భరత్ అనే నేను’. ఇప్పుడు అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయల్ లు జంటగా నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా కూడా వచ్చేసింది. వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. అల్లు అర్జున్ సినిమాలు ఈ మధ్య కమర్షియల్ గా మంచి ఫలితాన్నే సాధిస్తున్నాయి. మరి ఈ కొత్త సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. ఇక అసలు కథ విషయానికి వస్తే సూర్య( అల్లు అర్జున్)కు చిన్నప్పటి నుంచే విపరీతమైన కోపం. తండ్రితో గొడవ పడి బయటకు వెళ్లి పోతాడు. తర్వాత ఆర్మీలో చేరతాడు. అక్కడా నియంత్రించుకోలేని కోపంతో చిక్కుల్లో పడతాడు. కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాదిని హతమార్చటంతో ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. సూర్య జీవితకాల లక్ష్యం బోర్డర్ లో పనిచేయటం. ఇంత కోపం ఉన్న వ్యక్తిని బోర్డర్ కు పంపితే...మూడవ ప్రపంచ యుద్ధం కోరితెచ్చుకున్నట్లే అని ఆర్మీ అధికారిగా నటించిన బొమన్ ఇరానీ భయపడతారు. ఎలాగైనా బోర్డర్ కు వెళ్లాలనే తపనతో సూర్య తన కోపాన్ని నియంత్రించుకునేందుకు రకరకాలు ప్రయత్నాలు చేస్తాడు.

మళ్లీ సాధారణ వ్యక్తిగా మారి ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే ఆర్మీలోకి తీసుకుంటామని కండిషన్ పెడతారు అధికారులు. ఈ సైకాలజిస్టు సూర్యే తండ్రే. కోపాన్ని నియంత్రించుకుని...కొత్త మనిషిగా మారే క్రమంలో అల్లు అర్జున్ పడే సంఘర్షణ సినిమాలో ఆకట్టుకునేలా ఉంది. క్యారెక్టర్ మార్చుకోవటం అంటే చచ్చిపోయిన వాడితో సమానం అంటూ ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న సమయంలో తాను చెప్పిన సందేశాన్నే ..ఓ పోలీసు అధికారి నుంచి విని తాను చేస్తున్నది తప్పా..రైటా అనే సంఘర్షణలో సూర్య నలిగిపోతాడు. చివరకు తన ఒరిజినల్ క్యారెక్టర్ నే నమ్ముకుంటాడు. అల్లు అర్జున్‌ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడు. చాలా రఫ్ గా ఉంటాడు. ఫైట్లలో ఎంత రఫ్ గా ఉంటాడో...కోపాన్ని నియంత్రించుకునే సమయంలో అటు ఉండాలా...ఇటు మారాలా అనే సంఘర్షణ పడే సమయంలో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుటుంది.

యాక్షన్స్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. వెన్నెల కిషోర్..అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు అప్పుడప్పుడు ప్రేక్షకులను నవ్విస్తాయి. సినిమాలో డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలు... బన్నీ స్టైలిష్‌ డాన్స్‌ మూమెంట్స్‌ సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. హీరోయిన్‌గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్‌ గ్లామర్ ఒలకబోసింది. అయితే హీరోయిన్ పాత్ర పెద్దగా చెప్పుకునేంత స్కోప్ ఉన్నదేమీ కాదు. శరత్‌ కుమార్‌ తనదైన శైలిలో విలన్ పాత్రలో నటించాడు. ఓ ఫైట్ సీన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అయితే అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయల్ ల మధ్య లవ్ ట్రాక్ లో ‘బోర్డర్’ గురించి మాట్లాడే సమయంలో పోసాని కృష్ణమురళీతో అల్లు అర్జున్ మాట్లాడే డైలాగులు ద్వందార్ధలతో సాగటం సీరియస్ సినిమాలో ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేశాయి. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి నచ్చే సినిమా ఇది.

రేటింగ్. 2.75/5

Next Story
Share it