Telugu Gateway
Movie reviews

‘మహానటి’ మూవీ రివ్యూ

‘మహానటి’ మూవీ రివ్యూ
X

భర్త కంటే భార్యకు ఎక్కువ పేరొస్తే ఆ భర్త భరించగలడా?. ఎక్కడకు వెళ్లినా హీరో అయిన భర్తను వదిలేసి..ప్రజలు తన భార్య ఆటోగ్రాఫ్ కోసం వెంటపడితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది?. అదీ ఇగోలు ఎంతో పీక్ లో ఉండే సినీ పరిశ్రమలో. ఇతర రంగాల్లో ఉన్న వారిది అయినా అదే పరిస్థితి. కానీ సినీ పరిశ్రమలో ఇది ఒకింత ఎక్కువ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అచ్చం సావిత్ర కథ అలాంటిటే. అతి సామాన్య కుటుంబం నుంచి ఎన్నో కష్టనష్టాలను అధిగమించి సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంది సావిత్రి. అలాగే తన అద్భుత అభినయంతో అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో అప్పటికే పరిశ్రమలో హీరోగా ఉన్న జెమిని గణేషన్ తో ప్రేమలో పడుతుంది. ఆ వెంటనే పెళ్ళి కూడా చేసుకుంటుంది. అయితే అప్పటికే జెమిని గణేషన్ కు పెళ్ళి అయి పిల్లలు కూడా ఉంటారు. ఈ విషయం తెలిసి కూడా సావిత్రి పెళ్ళి చేసుకుంటుంది. ఆ తర్వాత జెమిని గణేషన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతుండటం...సావిత్రి మాత్రం కెరీర్ లో దూసుకెళుతుంటుంది. ఓ వైపు సావిత్రికి సన్మానాలు...మరో వైపు జెమిని గణేషన్ కు అవమానాలు. ఇక్కడే కుటుంబంలో వివాదాలు.

సావిత్ర నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా చేస్తుంది. ఇది ఏ మాత్రం ఇష్టం లేని జెమిని గణేషన్ తన భార్య స్వయంగా నిర్మించిన సినిమా ప్రీమియర్ షో కు కూడా హాజరు కాకుండా ఉంటారు. షూటింగ్ పేరు చెప్పి తప్పించుకుంటారు. అయితే స్టూడియోలో ఉన్నాడని తెలుసుకుని సావిత్రి వెళ్లి చూడగా..మరో అమ్మాయితో పట్టుపడతాడు. అంతే సావిత్రికి..జెమిని గణేషన్ కు అప్పటి నుంచి సంబంధాలు తెగిపోతాయి. ఆ క్రమంలో మందుకు బానిసగా మారిన సావిత్రి తన కెరీర్ ను...జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంది. సినీ రంగంలో ఎంతో డబ్బు సంపాదించిన సావిత్రి పెద్ద ఎత్తున దానధర్మాలు చేయటంతోపాటు..స్నేహితులకు అందరికీ సాయం చేస్తుంది. కానీ అవసరం అయిన సమయంలో ఎవరూ ఆమెను ఆదుకోరు. దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఎంపిక చేయటం ద్వారానే సగం సక్సెస్ సాధించేశారు.

ఎందుకంటే నిజంగా సావిత్రిని తలపించేలా కీర్తి సురేష్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఎస్వీ రంగారావుకుగా మోహన్ బాబు కొద్దిసేపే సినిమాలో కన్పించినా ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఓ పత్రికలో సావిత్రి జీవిత్ర చరిత్ర రాసే విలేకరిగా మధురవాణి (సమంత), అదే పత్రికలో ఫోటోగ్రాఫర్ అంటోనీ (విజయ్ దేవరకొండ) తమ పాత్రల్లో మెప్పించారు. నాలుగు హాట్ హాట్ పాటలు..జోకుల కోసం సినిమాకు పోతే నిరాశ తప్పదు కానీ.. ఈ తరం వాళ్ళు సావిత్రి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఓ మంచి చిత్రంగా ‘మహానటి’ నిలుస్తుంది.

రేటింగ్. 3.5/5

Next Story
Share it