‘మహానటి’పై ప్రశంసల వర్షం
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ ప్రతిష్టాత్మక సినిమా బుధవారం నాడు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేష్ ఇమేజ్ అయితే ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. అంతటి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ హీరోయిన్ కు. ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా కీర్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క కీర్తి సురేష్ కు మాత్రమే కాకుండా..ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన దుల్కర్ సాల్మన్, సమంత, విజయ్ దేవరకొండలపై అభినందల వర్షం కురుస్తోంది. ఇక చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పై టాలీవుడ్ దర్శక దిగ్గజాలు పొగడ్తల జల్లు కురిసింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి మహానటి చిత్ర బృందానికి అబినందనలుత తెలిపారు. ట్విట్టర్ వేదికగా వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘సరిగ్గా 28 ఏళ్ల కిందట ఇదే వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నేను తీసిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ ఇదే రోజు(మే 9న) విడుదలైంది. మళ్లీ ఇప్పుడు ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా వచ్చింది. సావిత్రి జీవితచరిత్రను సినిమాగా మలిచిన వైజయంతి మూవీస్‌కి అభినందనలు’’అని పేర్కొన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
బాహుబలి వంటి సినిమాను తెరకెక్కించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి కూడా మహానటిపై స్పందించారు. ‘‘ఏదో అనుకరిస్తున్నట్లు కాకుండా పాత్రల్లో అద్భుతంగా జీవించారు. కీర్తి సురేశ్.. సావిత్రిని మళ్లీ మనముందుకు సజీవంగా తీసుకొచ్చారు. ఇక దుల్కర్ సాల్మన్.. ఫెంటాస్టిక్! నేను అతనికి ఫ్యాన్ అయిపోయా. స్వప్నదత్, నాగ అశ్విన్‌లకు అభినందనలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. విజయవాడలో ‘మహానటి’ సినిమా చూసిన అనంతరం నిర్మాత అశ్వనీ దత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘18 నెలల కష్టానికి ఫలితం దక్కింది. బహుశా సావిత్రిగారి ఆత్మే దగ్గరుండిమరీ ఈ సినిమాను చేయించుకుంది. నా 44 ఏళ్ల సినీ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన సినిమా ఇదే. ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించడం ఖాయం. సినిమాలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.