Telugu Gateway
Andhra Pradesh

కర్ణాటక ఎన్నికలతో అశోక్ బాబుకు సంబంధం ఏంటి?

కర్ణాటక ఎన్నికలతో అశోక్ బాబుకు సంబంధం ఏంటి?
X

ఇదీ ఏపీ రాజకీయ, అధికార వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. ఉద్యోగ సంఘం నేతలు అధికారంలో ఉన్న వారి మెప్పు కోసం ఏదైనా చేయవచ్చా?. ఇప్పుడు అశోక్ బాబు చర్య పెద్ద దుమారమే రేపుతోంది. ఏపీ ఎన్జీవో సంఘం నేతగా ఉన్న అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్జీవోలకు ఏమైనా సమస్యలు తలెత్తితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలి. కానీ ఆయనకు పక్క రాష్ట్ర రాజకీయాలతో పనేంటి?. కర్ణాటక వెళ్లి ఏ రాజకీయ పార్టీకి అయినా ఎలా ప్రచారం చేస్తారు. ఉద్యోగ సంఘం నేత ఇలా రాజకీయ ప్రచారం చేయవచ్చా?. అశోక్ బాబు ఏపీ ప్రభుత్వ ఆమోదంతోనే వెళ్లారా?. లేక వ్యక్తిగత హోదాతో వెళ్లారా?. ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన వారికి ఓటువేసుకోవచ్చు. కానీ బహిరంగంగా రాజకీయాలు చేయకూడదు. మరి అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి ఎలా వెళ్తారు. అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏది కోరుకుంటే అశోక్ బాబు అదే చేస్తారా?. అంటే చంద్రబాబు తన లైన్ కు అనుగుణంగా ఉంటే...ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోరా?. నిత్యం విలువల గురించి మాట్లాడే చంద్రబాబు ఎన్జీవో నేత అశోక్ బాబు నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తారు?.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఏపీకి మోసం చేసిందని..కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి సభ నుంచి పిలుపునిచ్చారు. ఆయన పిలుపును కర్ణాటకలోని తెలుగువారు గౌరవిస్తారా? లేదా అన్నది వేరే విషయం. రాజకీయ నేతగా చంద్రబాబు పిలుపును అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ...అదీ ఎన్జీవో నేత రాజకీయాలు ఎలా చేస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అశోక్ బాబు చెపితే కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలు రాజకీయ నిర్ణయాలు తీసేసుకుంటారా?. ఎన్నికల తర్వాత అక్కడ నివాసం ఉంటున్న తెలుగువారికి ఏమైనా ఇబ్బంది వస్తే అశోక్ బాబు వెళ్లి వాళ్ళను కాపాడగలరా?. చంద్రబాబు రాజకీయాల కోసం కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టాలా?. అక్కడ ఉద్యోగాలు..వ్యాపారాలు చేసుకునే తెలుగు ప్రజలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరా?. దీనికి అశోక్ బాబు సూచనలు, సలహాలు కావాలా?. వ్యక్తిగతంగా ఆయనకు సలహాలు ఇఛ్చే హక్కు ఉండొచ్చు. కానీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఈ పనిచేయటం అభ్యంతరకరం అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it