Telugu Gateway
Politics

చిక్కుల్లో యోగీ..ఎంపీ తీవ్ర ఆరోపణలు

చిక్కుల్లో యోగీ..ఎంపీ తీవ్ర ఆరోపణలు
X

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చిక్కుల్లో పడ్డారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన ఆయనకు ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చి పడింది. అదీ సొంత పార్టీ ఎంపీ నుంచే కావటం విశేషం. ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన బిజెపి ఎంపీ ఛోటే లాల్‌ ఖర్వార్‌.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దళితుడిని అయినందుకు తనపై సీఎం వివక్షత ప్రదర్శించారంటూ ఖర్వార్‌ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ‘అయ్యా.. నా పేరు నేను ఛోటే లాల్‌ ఖర్వార్‌(45). యూపీలోని రాబర్ట్స్‌ గంజ్‌ నియోజక వర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాను. నా నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎం కార్యాలయానికి లేఖ రాశాను. బదులు లేకపోవటంతో స్వయంగా నేను కార్యాయానికి వెళ్లాను. దళితుడిని అయినందుకు నన్ను లోపలికి అనుమతించలేదు. పైగా తిట్టి బయటకు గెంటేశారు.

సొంత పార్టీ ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక ప్రజల సంగతేంటి? ప్రజాదర్భార్‌ పేరిట ఆయన(యోగి) చేస్తున్నదంతా డ్రామానేనా?. యూపీలో దళితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందనటానికి ఇదే ఉదాహరణ. దీనిపై మీరు స్పందించాలి.’ అని లేఖలో మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని స్పందించి.. చర్యలు తీసుకుంటానని ఖర్వార్‌కు హామీ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ చీఫ్‌ మహేంద్ర నాథ్‌ పాండేకు మూడుసార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదని.. అందుకే తాను ప్రధానికి లేఖ రాశానని ఖర్వార్‌ చెబుతున్నారు. అంతేకాదు యోగి హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. పైగా ఫిర్యాదు చేసినందుకు కొందరు తనను చంపుతామంటూ బెదిరించారని ఖర్వార్‌ ఆరోపిస్తున్నారు.

Next Story
Share it