Telugu Gateway
Telangana

తెలంగాణలో ఒక్కో గ్రామానికి 21 కోట్ల అప్పు

తెలంగాణలో ఒక్కో గ్రామానికి 21 కోట్ల అప్పు
X

తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ సర్కారు అప్పులపై ఫోకస్ పెట్టింది. కెసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 61 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇప్పుడు అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఆయన గురువారం వరంగల్‌లో కాగ్‌ నివేదికపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరాలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చని, అవి పరిపాలనలో జరిగిన తప్పిదాలు మాత్రమే అన్నారు. కానీ ఇపుడు కేసీఆర్‌ ప్రభుత్వం కావాలని తప్పిదాలు చేసిందని విమర్శించారు. కాగ్ అనేది వాచ్ డాగ్ అని, సుప్ర్రీం కోర్టు జడ్జితో సమాన హోదా కలిగిన సంస్థ కేసీఆర్‌ పాలనలో అనేక తప్పులను ఎత్తి చూపిందని తెలిపారు. తెలంగాణ అప్పు 2.21 లక్షల కోట్లు అయిందని, దీంతో సగటున ఒక్కో గ్రామానికి 21 కోట్ల రూపాయలు ఉందన్నారు.

ఒక్కో కుటుంబానికి 2.65 లక్షలు.. ఒక్కొక్క పౌరుడిపై 63 వేల రూపాయల భారం పడుతుందని వివరించారు. ఇదంతా కేసీఆర్‌ చేసిన ఘనతని ఆరోపించారు. అప్పును ఆదాయంగా, లోటును మిగులుగా చూపిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మిగులు బడ్జెట్‌ ఉందని ముఖ్యమంత్రి చెబుతుంటే.. 5,392 కోట్ల లోటు బడ్జెట్‌ ఉందని కాగ్‌ వెల్లడించిందని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 3.5 శాతం ఉండగా.. ఇపుడు 4.7 శాతానికి పెరిగి రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలోకి పోతున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో బడ్జెట్‌ లోని కేటాయింపులకు, ప్రభుత్వం చెబుతున్న వాస్తవ ఖర్చులకు పొంతన లేదన్నారు. డబ్బులన్నీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పెడుతూ కమీషన్లు దండుకుంటున్నారన్నారు. మరోవైపు మిషన్‌ కాకతీయకు లెక్కాపత్రం లేదని తెలిపారు.

Next Story
Share it