Telugu Gateway
Telangana

‘ప్రగతిభవన్’ వంటి విలాసవంతమైన భవనం ప్రధానికి కూడా లేదు

‘ప్రగతిభవన్’ వంటి విలాసవంతమైన భవనం ప్రధానికి కూడా లేదు
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. లక్ష చదరపు అడుగుల స్థలంలో..కోట్ల రూపాయల ప్రజల పన్నుల డబ్బుతో ప్రగతి భవన్ కట్టుకోలేదా?. దేశ ప్రధాని, ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా విలాసవంతమైన భవనం కట్టుకున్నది నిజం కాదా?. అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో సీఎంల అధికారిక నివాసాలకు ప్రజలు వచ్చి..వినతిపత్రాలు ఇచ్చేవారని..కానీ ప్రగతిభవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రవేశంలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయటానికి సిగ్గుండాలి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత, గిరిజన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ చెల్లించేందుకు పైసలుండవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పైసలు ఉండవు, ఎస్సీ, ఎస్టీ లోన్లకు పైసలు ఉండవు, దళిత, గిరిజనులకు మూడెకరాలు కొనిచ్చేందుకు పైసలుండవు, కానీ మీరు మాత్రం వందల కోట్లతో ఇండ్లు కట్టుకుంటున్నారు అని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో, ప్రైవేట్ జెట్లలో కేసిఆర్ ఫ్యామిలీ ప్రయాణాలు చేస్తోందని ఆరోపించారు. నాకు తెలివిలేదు అంటవా? నీకే తెలివి ఉందా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు.

కేసిఆర్ కుటుంబం తెలంగాణ ముసుగు వేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రగతిభవన్ లో ఆంధ్రా కాంట్రాక్టర్లు, సినిమావాళ్లు, నీ దోస్తులకు తప్ప సామాన్య రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ప్రవేశం ఉందా అని ప్రశ్నించారు. మేం ఎవరి సంచులూ మోయలేదు. మీరే సంచులు తీసుకుంటున్నారు. కేసిఆర్ గత చరిత్ర ఏందో. కుటంబసభ్యులు అమెరికాలో ఏం చేసేవారో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. అమెరికాలోనే నా పిల్లలు ఉంటారని కేసిఆర్ ఆనాడు చెప్పినా.. కానీ కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు తెలంగాణ మీద పడి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇది చాలదన్నట్లు మళ్లీ మా మీద ఏడుస్తున్నారా అని ఎద్దేవా చేశారు. కేసిఆర్ ఒళ్ళు బలిసి, అహంకారం పెరిగి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ము తిని తిని కేసిఆర్ ఫ్యామిలీ బలిసిపోయిందన్నారు. కేసిఆర్ ఏదో తీస్ మార్ ఖాన్ అన్నట్లు ఫెడరల్ ఫ్రంట్ పెడతాడట. ఇక్కడ తెలంగాణలోనే దిక్కులేదు. కానీ దేశాన్ని ఉద్ధరిస్తడట అని విమర్శించారు. తెలంగాణలో కెసీఆర్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని చైనాతో పోలుస్తుండు.. కనీస అవగాహన లేదు కేసిఆర్ కు అని విమర్శించారు. చైనాను, భారత్ తో పోల్చవచ్చా? అసలు చైనాలో డెమోక్రసీ ఉందా? హ్యూమన్ రైట్స్ ఉన్నాయా?ఇవేవీ తెలియకుండా చైనాతో పోల్చడం సమంసమా అని నిలదీశారు.

Next Story
Share it