Telugu Gateway
Telangana

కోదండరాం సభకు సమస్యలు సృష్టిస్తున్న సర్కారు

కోదండరాం సభకు సమస్యలు సృష్టిస్తున్న సర్కారు
X

తెలంగాణ జన సమితి (టీజెఎస్) ఆవిర్భావ సభకు సర్కారు ఆటంకాలు సృష్టిస్తోంది. చాలా ముందస్తుగానే సభకు అనుమతి కావాలని పార్టీ అధ్యక్షుడు కోదండరాం రెండు చోట్ల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటే రెండు చోట్లా పోలీసులు అనుమతి నిరాకరించటం కలకలం రేపుతోంది. అంటే కావాలనే సర్కారు కోదండరాం పార్టీ సభను అడ్డుకుంటుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. తాజాగా సీపీఎం సభలకు...భరత్ అనే నేను సినిమా సభకు కూడా అనుమతి ఇచ్చిన సర్కారు టీజెఎస్ ఆవిర్భావ సభకు ఆటంకాలు కల్పిస్తున్న తీరు కలకలం రేపుతోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర స్థాయిలో స్పందించారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అనుమతివ్వడంలేదని పోలీసులు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మేం సభ పెడతామంటే వద్దన్నారు. అదే భరత్ అనే నేను సినిమాకు ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇచ్చారు. ఆ సభకు వాహనాలు రాలేదా? ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో సభ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

టీజెఎస్ ఆవిర్భావ సభకు సన్నాకంగా వికారాబాద్ సత్యభారతి గార్డన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ‘‘నాయకులు మాట్లాడకుంటే ప్రజలకు న్యాయం జరగదు. కానీ ఆ నాయకులే అమ్ముడు పోతున్నరు. సమస్యల పరిష్కారాల కోసం నాలుగేళ్లుగా కొట్లాడుతున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టిందే తెలంగాణ జనసమితి పార్టీ. ఎవరో వెనుక ఉండి చెబితే పెట్టిన పార్టీకాదిది. తెలంగాణ వచ్చి నాలుగేళ్లైనా వికారాబాద్ జిల్లాకు సాగునీటి జాడలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెబితే ఇగ ఏం చెప్పాలె!’ అని కోదండరాం అన్నారు. టీజెఎస్ సభకు అనుమతి నిరాకరణపై హైకోర్టును ఆశ్రయించారు. కాలుష్యం సాకుతో అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ న్యాయవాది రచనా రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌ స్టేడియం, ఎన్డీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏదో ఒక చోట సభ నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదావేసింది. టీజెఎస్ సభకు అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా స్పందించారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తుందని ఆరోపించారు. సినిమా వాళ్ళ సభలకు అనుమతి ఇచ్చి..తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి సభకు అనుమతి ఇవ్వరా? అని విహెచ్ ప్రశ్నించారు.

Next Story
Share it