Top
Telugu Gateway

బిజెపికి వ్యతిరేకంగా కర్ణాటకకు టీడీపీ బృందాలు

బిజెపికి వ్యతిరేకంగా కర్ణాటకకు టీడీపీ బృందాలు
X

బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య ‘కర్ణాటక’ అసెంబ్లీ ఎన్నికలు వేడి రాజేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు కర్ణాటకలో బిజెపిని మట్టికరిపించాలని..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బిజెపిని దెబ్బతీయాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపింద’ని మాణిక్యాలరావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవని వ్యాఖ్యానించారు.

‘నేను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. నన్ను పట్టించుకోవడం లేదు. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే పైనుంచి నిధులు కట్ చేసి ఉంటారనే భావనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు. రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు.

Next Story
Share it