అవినీతి డబ్బుకు రశీదులు ఇవ్వరుగా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై మాట్లాడుతూ..ప్రచారంలో ఉన్న అంశాలనే తాను చెప్పానని..అవినీతి డబ్బుకు రశీదులు ఇవ్వరు కదా? అని వ్యాఖ్యానించారు. తాను ఆమరణ దీక్ష ఎప్పుడు చేస్తాననే విషయాన్ని తనకు వదిలేయాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటనపై కూడా పవన్ స్పందించారు. ఇప్పటికే చాలా ఆలశ్యం అయిందని..ఆయన ఈ పని ఎప్పుడో చేయాల్సిందన్నారు. లోక్ సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా చేయటం అంటే ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీని తాకేలా జాతీయ రహదారులపై పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని తెలిపారు. విజయవాడలో తాను ఈ పాదయాత్ర లో పాల్గొంటానని వెల్లడించారు. సభను సజావుగా జరపాల్సిన బిజెపి ఈ బాధ్యతను నిర్వర్తించటంలో విఫలమైందని అన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బగా పేర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపైనే పాదయాత్ర చేస్తామని..అవిలేని చోట ముఖ్యకూడళ్లలో ఈ పాదయాత్రలు ఉంటాయన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుంటే టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. పాదయాత్రల కార్యక్రమం ముగిసిన తర్వాత అనంతపురం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో మేధావులతో చర్చలు..సభలు నిర్వహించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కార్యాచరణ ఖరారు చేసేందుకు పవన్ బుధవారం నాడు విజయవాడలో వామపక్ష నేతలతో సమావేశం అయ్యారు. ఈ పాదయాత్రల్లో వామపక్ష పార్టీల నేతలు కడా పాల్గొంటారని అన్నారు.