Telugu Gateway
Telangana

కలకలం...ఎన్ఐఏ కోర్టు జడ్జి రాజీనామా

కలకలం...ఎన్ఐఏ కోర్టు జడ్జి రాజీనామా
X

ఓ వైపు మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పు. తీర్పు వెలువరించిన వెంటనే ఎన్ఐఏ కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తీర్పు వెలువరించిన వెంటనే జడ్జి తన రాజీనామా లేఖను పంపటం వెనక కారణాలు ఏమై ఉంటాయా? అన్న చర్చ న్యాయవాద వర్గాల్లో సాగుతోంది. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నప్పటికీ... గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏమైనా ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారా? ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా?...అన్న చర్చ సాగుతోంది.

గత కొన్ని రోజులుగా కొంత మంది న్యాయమూర్తులు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. రవీందర్ రెడ్డి మాత్రం తన రాజీనామాకు సంబంధించి ఇప్పుడేమీ మాట్లాడలేనని, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను చెప్పదలచుకున్న విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడతానని రవీందర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సోమవారం తీర్పు తర్వాత బెదిరింపులు వచ్చినట్లు రవీందర్ రెడ్డి ఆయన తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి మరో రెండు నెలల్లో రవీందర్ రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో రాజీనామా చేయటం వెనక కారణాలు ఏమై ఉంటాయా? అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it