ఎట్టకేలకు టీడీపీ ఛైర్మన్ నియామకం

ఎట్టకేలకు ఏడాది తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఛైర్మన్ వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి కొత్త నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఒకేసారి పదిహేడు సంస్థలకు సర్కారు చైర్మన్‌లను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్ష పదవిని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను వరించింది. ఆయన గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో క్రిస్టియన్ల సువార్త సభలకు హాజరు అయ్యారని..ఫోటోలు సాక్షిగా సోషల్ మీడియాలో దుమారం రేగినా చంద్రబాబు తన రాజకీయ కోణంలోనే ఈ నియామకం చేసినట్లు కన్పిస్తోంది. మరో కీలక పోస్టు అయిన ఆర్టీసీ చైర్మన్ పదవి వర్ల రామయ్యకు దక్కింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో మరో దళిత నేత జూపూడి ప్రభాకరరావును కొనసాగించారు. మాదిగ సామాజిక వర్గం ఒత్తిడితో ఈసారి ఈ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని మార్చాలని అనుకొన్నా... ఆ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు మరో పెద్ద కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో జూపూడిని ఇందులో కొనసాగించాలని నిర్ణయించారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డికి సాగునీటి అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి లభించింది. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు అనూహ్యంగా కాపు కార్పొరేషన్ అధ్యక్ష పదవి వరించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేత నామన రాంబాబుకు గృహ నిర్మాణ సంస్థ అధ్యక్ష పదవి ఇచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి దక్కింది. పార్టీ సీనియర్ నేత లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్‌కు మైనారిటీ కమిషన్ ఛైర్మన్ పదవి దక్కింది. మైనారిటీ ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా హిదాయత్‌కు మరోసారి అవకాశం లభించింది. హిదాయత్, జూపూడికి మాత్రమే తమ కార్పొరేషన్లలో కొనసాగింపు లభించింది. పార్టీ శిక్షణ శిబిరాల నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నేత రాజా మాస్టార్‌కు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్ష పదవి ఇచ్చారు. మంత్రి అమర్‌నాథరెడ్డి చేరికతో అవకాశం కోల్పోయిన చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ నేత సుభాస్ చంద్రబోస్, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవులు లభించాయి. టీడీపీ ఛైర్మన్ నియామకం పూర్తయినందున..బోర్డును కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.