Telugu Gateway

తప్పును ఒప్పుకున్న ఫేస్ బుక్

తప్పును ఒప్పుకున్న ఫేస్ బుక్
X

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ తన తప్పును ఒప్పేసుకుంది. డేటా దుర్వినియోగం కాకుండా చేసేందుకు తాము తగినంత పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోయినట్లు అంగీకరించింది. సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోమవారం ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు నివేదించారు. తమ తప్పుకు గాను ఆయన కాంగ్రెస్ ను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకమైన వాంగ్మూలాన్ని కాంగ్రెస్ ముందు ఉంచారు. ఫేస్ బుక్ ప్రారంభం..నిర్వహణకు పూర్తి బాధ్యత తనదే అయినందున తప్పుకు కూడా తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రత అంశంపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని..దీని వల్ల తమ సంస్థ లాభాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

ప్రస్తుతం సంస్థలో 15 వేల మంది కంటెంట్, భద్రత సమీక్షపై పనిచేస్తున్నారని..త్వరలోనే ఈ సంఖ్య 20 వేలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే లాభాలు పెంచుకోవటం కంటే సమాజాన్ని రక్షించటమే ముఖ్యం కనుక తాము ఈ దిశగా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే భద్రతాపరమైన సమస్యలను అధిగమించేందుకు చేపట్టే చర్యలకు కొంత సమయం పడుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ కమిటీల ముందు ఆయన హాజరు కానున్నారు.

Next Story
Share it