Telugu Gateway
Cinema

మహేష్ బాబు ఆడియో వేడుకకు ఎన్టీఆర్

మహేష్ బాబు ఆడియో వేడుకకు ఎన్టీఆర్
X

మహేష్ బాబు బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు సభ ఏంటి అనుకుంటున్నారా?. శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియం వేదికగా ‘భరత్ అను నేను’ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో ఎన్టీఆర్’ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సభకు ఎన్టీఆర్ హాజరు కావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం ఒకెత్తు అయితే...ఈ చిత్ర దర్శకుడు కొరటాల శ్రీను, ఎన్టీఆర్ లు కూడా సన్నిహితులే. ఈ చిత్ర నిర్మాత డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత దానయ్య. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కె మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించనున్న సినిమాకు నిర్మాత కూడా దానయ్యే.

ఇలా పలు అంశాలు ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి రప్పించేలా చేశాయని ఫిల్మ్ నగర్ టాక్. అయితే కొత్త సినిమా లుక్ బయటపడుతుందనే కారణంతో తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎమ్మెల్యే ఆడియో వేడుకకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. సొంత సోదరుడి సినిమాకు డుమ్మా కొట్టి ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు హాజరు కావటం ఎలాంటి సంకేతాలు పంపుతుందనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. సాధారణంగా తన సినిమాలకు చీఫ్‌ గెస్ట్‌ లంటూ ప్రాధాన్యం ఇవ్వని మహేష్‌ బాబు తొలిసారి ఎన్టీఆర్‌తో స్టేజీని షేర్‌ చేసుకోబోతుండటం విశేషం. భరత్ అను నేను సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story
Share it