Telugu Gateway
Top Stories

కర్ణాటక సర్కారుకు ఐటి షాక్

కర్ణాటక సర్కారుకు ఐటి షాక్
X

ఊహిస్తున్నట్లే కేంద్రం కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం కలకలం రేపుతోంది. దీంతో సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడతారా? లేదా అన్నది కొంత కాలం పోతే కానీ తెలియదు. కర్ణాటక సీఎస్ కు ఐటి శాఖ నోటీసులు జారీ చేయటం విశేషం. ముఖ్యంగా ఇది కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులపై కావటం విశేషం. మార్చి 31తో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికంలో రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చేసిన భారీ చెల్లింపుల వివరాలను తమకు పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖర్చు పెట్టేలా పలువురు కాంట్రాక్టర్లకు సిద్దరామయ్య ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు చెల్లించిందనే బీజేపీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఐటీ నోటీసులు జారీ చేయటం ప్రాముఖ్యత సంతరించుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథి అమిత్‌ షాలు రాష్ట్రంలో పర్యటించిన సమయంలో సిద్దరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రతి పనికీ 10 శాతం చొప్పున కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మే 12న జరగనున్న ఎన్నికలకు సంబంధించి కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టేలా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వం నిధుల వరద పారించిందని తమకు సమాచారం అందినట్టు ఈనెల 6న ప్రభుత్వానికి పంపిన నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు కాంట్రాక్టర్లకు చెల్లించిన వివరాలను తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రత్నప్రభ.. అన్ని వివరాలను అందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఐటీ శాఖకు అన్ని వివరాలూ అందజేస్తామని మీడియాకు తెలిపారు.

Next Story
Share it