Telugu Gateway
Top Stories

సుప్రీంలో ‘సుప్రీం’ చీఫ్ జస్టిసే

సుప్రీంలో  ‘సుప్రీం’ చీఫ్ జస్టిసే
X

సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపు...బెంచ్ ల ఏర్పాటు వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చింది. సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తుత ధోరణిపై తీవ్ర విమర్శలు చేసినా..ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన పాత వైఖరికే కట్టుబడి ఉన్నారు. సుప్రీంకోర్టులో నెలకొన్నసీనియర్ న్యాయమూర్తుల విభేదాల అంశం బుధవారం నాడు కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విషయంలో అయినా ప్రధాన న్యాయమూర్తే సుప్రీం అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజెఐ) సమానుల్లో ప్రధములు అని తేల్చిచెప్పింది. కేసులను బెంచ్ లకు కేటాయించటంతోపాటు..ధర్మాసనాలు ఏర్పాటు చేయటంలో పూర్తి హక్కులు భారత ప్రధాన న్యాయమూర్తికే ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. కేసుల కేటాయింపులపై మార్గదర్శకాలు ఖరారు చేయాలంటూ దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అశోక్ పాండే అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఈ కేసు దాఖలు చేశారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలోని జస్టిస్ ఏ ఏం ఖాన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్ ల తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై తీర్పును చంద్రచూడ్ వెలువరించారు. రాజ్యాంగం కూడా సుప్రీం కోర్టులో సీజెఐనే సుప్రీం అని పేర్కొందని ఆయన పేర్కొన్నారు. ఆయన హక్కుల గురించి పిటీషన్ వేయటం కూడా ఆ పదవికి అపకీర్తి తేచ్చే ప్రయత్నమే అని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. కొద్ది రోజుల క్రితమే జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని సీనియర్ జడ్జిలు ఇదే అంశంపై మీడియా ముందుకు వచ్చి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మధన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు మీడియా ముందుకు వచ్చి మరీ సీజెఐ తీరును తప్పుపట్టారు. ఇది దేశ న్యాయవ్యవస్థలో పెద్ద కలకలం రేపింది.

Next Story
Share it