Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు చేతిలో ఉప ముఖ్యమంత్రి కెఈకి అవమానం

చంద్రబాబు చేతిలో ఉప ముఖ్యమంత్రి కెఈకి అవమానం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతిలో మంత్రులకు వరస పెట్టి పరాభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి చంద్రబాబు చేతిలో మరోసారి పరాభవం చవిచూశారు. ఓ వైపు చంద్రబాబు బీసీలే నా ప్రాణం..పార్టీకి వెన్నెముక అని చెబుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఎంతో సీనియర్ మంత్రి అయిన కె ఈ ని చంద్రబాబు అవమానించటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు చంద్రబాబు అమరావతిలో ‘భూదార్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఇందులో రెవెన్యూ శాఖదే కీలక పాత్ర. అయినా కూడా ఉప ముఖ్యమంత్రి కె ఈ కి కనీసం సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు ఈ కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో కె ఈ తన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరుకు రెవెన్యూ శాఖ కెఈ వద్ద ఉన్నా..అన్నింటిలో సీఎంవో జోక్యమే ఎక్కువ ఉందనే విమర్శలు ఉన్నాయి.

రాజధాని భూముల వ్యవహారం, మంత్రి వర్గ ఉపంఘాల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కెఈ కి వరసపెట్టి పరాభవాలు ఎదురవుతున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పను ఆయన శాఖకు చెందిన నూతన భవన ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం అందలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు..ఏ మాత్రం సంబంధం లేని మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వంలో హవా అంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, మరో మంత్రి నారాయణల హవానే సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నారాయణ తప్పిదాలు ఎన్ని ఉన్నా కూడా చంద్రబాబు ఏ రోజు కూడా కనీసం పల్లెత్తి మాట నారాయణపై రానివ్వటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it