Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై ఏపీ పార్టీల ‘అవిశ్వాసం’

చంద్రబాబుపై ఏపీ పార్టీల ‘అవిశ్వాసం’
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒంటరయ్యారు. ఆయన పిలిస్తే ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా పలికే పరిస్థితి లేదు. కనీసం అటువైపు కూడా చూడటానికి సిద్ధంగా లేవంటే చంద్రబాబునాయుడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. శనివారం నాడు రెండవ అఖిలపక్షానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తుంటే..మీ అఖిలపక్షానికి మేం రావటం లేదు పొమ్మంటూ వైసీపీ, బిజెపి, జనసేన, సీపీఎం, సీపీఐలు తేల్చిచెప్పాయి. దీంతో చంద్రబాబునాయుడు ఇరకాటంలో పడినట్లు అయింది. ఇప్పుడు చంద్రబాబు ఎవరితో అఖిలపక్షం నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ చంద్రబాబు అఖిలపక్షానికి రామని చెప్పటంతో ఒక రకంగా ఇవన్నీ చంద్రబాబుపై ‘అవిశ్వాసం’ పెట్టినట్లు అయిందని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితి ఎదురుకాలేదు. చంద్రబాబు పిలిస్తే కనీసం చిన్నా..చితకా పార్టీలు కూడా పలకటానికి సిద్ధంగా లేవు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కాలం చెల్లింది అని చెప్పిన ఆయనే ఇప్పుడు అదే కమ్యూనిస్టులను రాజకీయ అవసరాల కోసం ఆహ్వానిస్తున్నా..వాళ్లు కూడా చంద్రబాబు వైపు చూడటం లేదు.

ఎవరూ రారని ఉద్దేశంతోనే తొలి సమావేశానికి కమ్యూనిస్టులను ఆహ్వానించారు. తొలిసారి నిర్వహించిన అఖిలపక్షానికి హాజరైన సీపీఎం, సీపీఐలు శనివారం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. దీంతో చంద్రబాబు పిలిస్తే పలికే పార్టీ ఏపీలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటం ఆయన పరిస్థితిని బహిర్గతం చేస్తుంది. ప్రజా సంఘాలు ఏమైనా ఉంటే వాటితో అఖిలపక్షం జరుపుకోవాలి తప్ప..చంద్రబాబు రెండవ అఖిలపక్షం అట్టర్ ఫ్లాప్ కానుంది. అసలు ఏపీలోని ఒక్క పార్టీ కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబును విశ్వసించకపోవటం రాజకీయంగా చాలా తీవ్రమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. చంద్రబాబు అఖిలపక్షానికి వస్తే గిస్తే భవిష్యత్ లో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే రావాలి. చంద్రబాబు క్రమక్రమంగా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it