Telugu Gateway
Movie reviews

‘ఛల్ మోహన్ రంగా’ మూవీ రివ్యూ

‘ఛల్ మోహన్ రంగా’ మూవీ రివ్యూ
X

అ...ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన సినిమా ‘లై’. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు. నితిన్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా ‘ఛల్ మోహన్ రంగా’. లై సినిమాలో చేసిన నితిన్ పక్కన హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాషే ఈ కొత్త సినిమాలోనూ నితిన్ కు జోడీ కట్టింది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు చల్ మోహన్ రంగా సినిమాకు నిర్మాతలు వ్యవహరించారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే మోహన్ రంగ (నితిన్) చిన్నప్పటి నుంచే ఎలాగైనా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించి..మంచిగా ఇళ్ళు కట్టుకోవటంతో పాటు..ఖరీదు అయిన కారు కొనుక్కుని తిరగాలనే లక్ష్యంగా పెట్టుకుంటాడు.

మరి ఆ లక్ష్యాన్ని అందుకునేలా కష్టపడి చదువుతాడా? అంటే అదీ లేదు. అన్నీ అత్తెసరు మార్కులే. ఆ మార్కుల లిస్టుతో వీసాకు వెళ్లిన ప్రతిసారీ రిజక్ట్ అవుతూనే ఉంటుంది. ఎలాగైనా అమెరికా వెళ్లాలనే లక్ష్యంతో ఉన్న మోహన్ రంగా తమ వీధి చివర్లో ఉండే మహిళ చనిపోవటంతో ఆమె శవాన్ని తీసుకుని అమెరికా వెళతాడు. ఆమె నలుగురు కొడుకులు అమెరికాలో ఉండటంతో వాళ్ళు హైదరాబాద్ రాకుండా ఆమె మృతదేహన్ని అమెరికా తీసుకురావాలని కోరతారు. ఎలాగైనా అమెరికా వెళ్ళాలనే లక్ష్యంతో ఉన్న మోహన్ రంగా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని వీసా సంపాదిస్తాడు. తమ తల్లి శవాన్ని అమెరికా తెచ్చినందుకు అమెరికాలో స్థిరపడిన ఆమె నలుగురు కొడుకుల్లో ఎవరో ఒకరు తనకు ఉద్యోగావకాశం కల్పించకపోతారా అన్న ఆశతో ఉన్న మోహన్ రంగా ఈ పని చేస్తాడు. మోహన్ రంగాకు కు వారి దగ్గర చేదు అనుభవం ఎదురవుతుంది. చివరకు ఎలాగోలా అమెరికాలో ఉద్యోగం సంపాదిస్తాడు. మోహన్ రంగాకు మేఘా చిన్నప్పుడే హైదరాబాద్ లోనే పరిచయం అయినా...అమెరికాలో వీళ్లిద్దరూ కలుసుకుంటారు. అక్కడ నుంచి వీరి లవ్ ట్రాక్ నడుస్తుంది. కానీ భిన్నధృవాలుగా ఉన్న తాము జీవితంలో కలసి ముందుకు సాగగలమా? లేదా అన్న విషయంలో సందేహంతో ప్రేమను వ్యక్తపర్చుకోరు. పలు మలుపుల మధ్య వీరి ప్రేమ సక్సెస్ కావటంతో సినిమా సుఖాంతం అవుతుంది. దర్శకుడు కృష్ణచైతన్య ఈ సినిమాను ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిచంటంలో సక్సెస్ అయ్యారు.

హీరో నితిన్ ఫుల్ ఎనర్జీతో తన 25వ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మేఘా ఆకాష్ కూడా ప్రేమను వ్యక్తపరిచే విషయంలో ఓ సగటు అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణను తెరపై ఆవిష్కరించటంలో సక్సెస్ అయింది. సినిమాలో కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. ఫస్టాఫ్ అయితే అప్పుడే ఇంటర్వెల్ కు వచ్చామా అన్నంత వేగంగా సాగిపోయింది. సెకండాఫ్ లోనూ ఎక్కడా కామెడీ తగ్గకుండా సినిమాను పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా..నితిన్ డ్యాన్స్ మాత్రం బాగుంది. నిర్మాతలు ఏ మాత్రం ఖర్చుకు వెరవకుండా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూశారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన రావు రమేష్, లిజి, నరేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఓవరాల్ గా చూస్తే ఛల్ మోహన్ రంగా మండు వేసవిలో వినోదాల విందు అందించే సినిమాగా నిలుస్తుంది.

రేటింగ్. 3.5/5

Next Story
Share it