Telugu Gateway
Movie reviews

‘భరత్ అనే నేను’ మూవీ రివ్యూ

‘భరత్ అనే నేను’ మూవీ రివ్యూ
X

మహేష్ బాబు. ఈ మధ్య కాలంలో వరస పెట్టి ఫ్లాప్ లు చవిచూసిన హీరో. ఈ హీరో తాజా సినిమాలు స్పైడర్..బ్రహ్మోత్సవం డిజాస్టర్స్ గా మిగిలాయి. అంతకు ముందు మాత్రం ‘శ్రీమంతుడు’ మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా కొరటాల శివ, మహేష్ బాబుల కాంబినేషన్ కావటంతో ‘భరత్ అనే నేను’ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించటం. బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భరత్ అనే నేను సినిమాతో ఫెయిల్యూర్స్ బారి నుంచి బయటపడినట్లే కన్పిస్తోంది. సినిమా అసలు కథ విషయానికి వస్తే అప్పటి వరకూ లండన్ లో చదువుకున్న భరత్ (మహేష్ బాబు) సడన్ గా తన తండ్రి ఆకస్మిక మరణంతో తిరిగొస్తాడు. తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీలో చీలికలు నివారించటానికి అయిష్టంగానే భరత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆ తర్వాత సీఎంగా భరత్ తీసుకునే నిర్ణయాలు..ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ పొందేలా చేస్తాయి.

అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాష్ రాజ్ తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా..సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవటం, బదిలీల్లో తన సిఫారసులను పట్టించుకోకపోవటంపై భరత్ పై కోపం పెంచుకుంటాడు. ఎలాగైనా భరత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యమంత్రిగా రోజూ సచివాలయానికి వెళ్లే సమయంలో బస్టాప్ లో తన స్నేహితులతో కలసి ఉండే వసుమతి (కైరా అద్వానీ)ని చూసి ఆకర్షితుడు అవుతాడు భరత్. ఎలాగైనా ఆమె ప్రేమ పొందాలని ప్రయత్నాలు చేస్తాడు. ఆ సమయంలోనే మీడియాలో వచ్చిన ఓ వార్త వీరిద్దరి మధ్య దూరం పెంచుతుంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను ప్రస్తుత రాజకీయ, మీడియా పరిస్థితులను కళ్ళకుకట్టేలా చూపించాడు. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు తన పాత్రకు న్యాయం చేశాడు. నిస్వార్థంగా ఉండే ఓ యువకుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూపించాడు ఈ సినిమా ద్వారా దర్శకుడు కొరటాల.

హీరోయిన్ కైరా అద్వానీ పాత్ర పరిమితం అయినా...ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ పార్టీ అధ్యక్షుడిగా, అసలైన రాజకీయవేత్తగా ప్రకాష్ రాజ్ నటన నిజజీవిత రాజకీయ సంఘటలను గుర్తుకు తెస్తాయి. ప్రతిపక్ష నేత పాత్రలో దేవరాజు తన పాత్రకు న్యాయం చేశాడు. నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించటమే అసలైన నాయకుడి లక్షణం అనే సందేశాన్ని ఇఛ్చాడు ఈ సినిమా ద్వారా కొరటాల శివ. కమర్షియల్ అంశాల జోలికి పెద్దగా పోకుండా..ఎక్కువ తాను అనుకున్న స్టోరీలైన్ ను బలంగా చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. సెకండాఫ్ లో ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత భరత్ నిర్వహించిన విలేకరుల సమావేశం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ‘భరత్ అనే నేను’ మహేష్ బాబు ను తిరిగి గాడిలో పడేసినట్లే.

రేటింగ్.2.75/5

Next Story
Share it