Telugu Gateway
Top Stories

మారిన సీన్...అవిశ్వాసం చర్చకు వస్తుందా!

మారిన సీన్...అవిశ్వాసం చర్చకు వస్తుందా!
X

లోక్ సభలో సీన్ మారింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు ఏఐడీఎంకె ఝలక్ ఇచ్చింది. కావేరీ బోర్డు విషయంలో సర్కారు నిర్ణయం తీసుకోకపోతే తాము అవిశ్వాస తీర్మానం పెట్టడమో..లేకపోతే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వటమే చేస్తామని ప్రకటించింది. దీంతో సీన్ మారిపోయింది. ఇంత కాలం అవిశ్వాసం తీర్మానం సభలో చర్చకు రాకుండా ఏఐడీఎంకె అడ్డుపడుతూ వస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏఐడీఎంకె నిర్ణయం మార్చుకోవటం ఆసక్తికరంగా మారింది. లోక్‌సభలో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సీపీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీల వరుస అవిశ్వాస తీర్మానాలతో సతమతమౌతున్న బీజేపీకి ఇది ఊహించని పరిణామం.

కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేక ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమో నిర్ణయిస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం తొమ్మిదోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానం సంబంధించి చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల చివరి వరకు వేచి చూస్తామని తెలిపారు.హోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేసి ఏపీ భవన్‌ వద్ద దీక్షకు దిగుతామని వెల్లడించారు.

Next Story
Share it