Telugu Gateway
Top Stories

మోడీపై వైసీపీ అవిశ్వాసం ముందుకు

మోడీపై వైసీపీ అవిశ్వాసం ముందుకు
X

రెండవ దశ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా సాఫీగా సాగలేదు. భవిష్యత్ లో సాగేలా కూడా లేవు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలతోపాటు..ఇతర ప్రధాన పార్టీలు కూడా తమ తమ డిమాండ్లపై సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి. దీంతో పార్లమెంట్ షెడ్యూల్ కంటే ముందుగానే వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి.దీంతో ఏపీకి చెందిన ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ మార్చి 16నే లోక్ సభలో అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ అవిశ్వాస తీర్మానం మార్చి 21న పెట్టాల్సి ఉంది.

అదే సమయంలో అవిశ్వాసంపై మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కోరనుంది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కలిసి..ఈ వివరాలతో లేఖలు కూడా అందజేశారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులను కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు.

Next Story
Share it