Telugu Gateway
Top Stories

చంద్రబాబు స్కామ్ లు మీడియా దాచేస్తోంది

చంద్రబాబు స్కామ్ లు మీడియా దాచేస్తోంది
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దేశంలో ఎక్కడా జరగనట్లు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని..అయితే చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా అవేమీ బయటకు రాకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. ఇలంటి వాటిలో ఆయన దిట్ట అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లు, ఇసుక, మట్టి, కరెంట్‌, భూములు, బొగ్గు కొనుగోళ్లు ఇలా ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోంది. అడ్డగోలుగా అవినీతి చేస్తూ మేనేజ్‌ చేస్తున్నారని తెలిపారు. జగన్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. తాజాగా చోటుచేసుకున్న సంఘటనలు చూస్తే కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటన కొత్తదేం కాదన్నారు. సెప్టెంబర్‌ 8, 2016లో కూడా ఆయన ఇవే మాటలు మాట్లాడారు.. అప్పుడు అర్థరాత్రి జైట్లీ ఇవే మాటలు చెబితే చంద్రబాబు స్వాగతించారు. జైట్లీకి, వెంకయ్యకు శాలువాలు కప్పారు. అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపిస్తూ తీర్మానాలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన ఘట్టం, దానితో ఏ మేలు జరుగుతుందని మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా ఆయన మళ్లీ స్టాండ్‌ మార్చారు. ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి, మరో ఏడాదిలో ఎన్నికలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామాలు చేస్తామని, అవిశ్వాస తీర్మానంవంటి అంశాల నేపథ్యంలో చంద్రబాబు దిగొచ్చారని జగన్ తెలిపారు.

ప్రజల విజయంతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం చివరి దశ వచ్చే నాటికి మేమే భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు పోరాటం చేశాం అని బ్రిటీషు వాళ్లు అన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం ఉంది. మొత్తానికి చంద్రబాబు తలఒగ్గాడు.. ఒగ్గినందుకు సంతోషం. అయితే, రాజీనామాలు చేయాలనుకున్న చంద్రబాబు అంతకుముందే ఢిల్లీ వాళ్లతో ఎందుకు ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి, విశ్వసనీయత, విలువలు, నిజాయితీ చాలా ముఖ్యం. బాబుకు ఇవేవి లేవు.. అందుకే పూటకో మాట రోజుకో పాట పాడుతున్నారు. ఏం చేసినా పడి ఉంటారులే అన్న చంద్రబాబు ఆలోచనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే వస్తుంది. చంద్రబాబుకు ఒకటే చెబుతున్నా.. మేం మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం.. ఆ డేట్‌ ఎందుకు నిర్ణయించామంటే మీకు సమయం ఇవ్వడం కోసం.. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు అవిశ్వాసం పెడితే కేంద్రానికి ఒక సందేశం పోతుంది. 21వ తేదీకంటే ముందే అవిశ్వాసం పెట్టమంటే పెట్టేందుకు నేను సిద్ధం.. ముందుకు జరపాలన్నా.. జరుపుతా.. లేదా మీరు అవిశ్వాసం పెడతామన్నా మద్దతు ఇస్తా.

పార్లమెంటు చివరి రోజున అవసరం అయితే, అంతా రాజీనామాలు చేద్దాం.. దేశం మొత్తం చూస్తుంది. పెద్ద చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెరిగి ఏం చేయాలో అది జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి కచ్చితంగా మద్దతు ఇస్తాం. బీజేపీ హోదా ఇవ్వకుంటే వారికి మద్దతు ఇవ్వం. కాంగ్రెస్‌ వాళ్లు ప్రధాని అయ్యే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. మున్మందు పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దాం. అందుకే ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.. 25కు 25మంది ఎంపీలను వైఎస్‌ఆర్‌సీపీకి ఇవ్వండి.. మీరో మరోసారి ఎవ్వరినీ నమ్మొద్దు.. ఎవరు హోదాకు మద్దతిస్తే వారికి సపోర్ట్‌ చేస్తాం.. హోదాపై సంతకం చేశాకే మద్దతు ప్రకటిస్తాం అని ప్రకటించారు.

Next Story
Share it