Telugu Gateway
Telangana

‘ఆ నలుగురు’ కాస్తా ఇప్పుడు ఐదుగురు అవుతున్నారా!

‘ఆ నలుగురు’ కాస్తా ఇప్పుడు ఐదుగురు అవుతున్నారా!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పై ఉన్న ప్రధాన విమర్శ ‘ ఆ నలుగురు’ అనే. అంటే ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రులు కెటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితలే అని. వీళ్ళకు తప్ప..మిగిలిన వారికి పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నలుగురు కాస్తా..ఇప్పుడు ఐదుగురిగా మారనుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కెసీఆర్ బంధువు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కానున్నారు. దీని కోసమే అన్నట్లుగా కొద్దిరోజుల క్రితమే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యూహాత్మకంగా సంతోష్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. సీఎం అయిన దగ్గర నుంచి సీఎం కెసీఆర్ ను ఎవరు కలవాలన్నా సంతోష్ కుమార్ అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడుగా మారనుండటంతో కీలక స్థానాల్లో కెసీఆర్ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగనుంది. అందరి కంటే ముందే రాజ్యసభకు సంతోష్ కుమార్ పేరును వ్యూహాత్మకంగా ప్రచారంలో పెట్టారు.

టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచే వారి పేర్లను కెసీఆర్ ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ) లను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించారు. వీరంతా సోమవారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కూడా సోమవారమే. రాష్ట్రంలోని మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యమైతే ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్ బరిలో నిలవాలని నిర్ణయించటంతో తెలంగాణలో ఎన్నిక అనివార్యంగా కన్పిస్తోంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం మూడు స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే పడనున్నాయి.

Next Story
Share it