Telugu Gateway
Movie reviews

‘రంగస్థలం’ మూవీ రివ్యూ

‘రంగస్థలం’ మూవీ రివ్యూ
X

రంగస్థలం. రామ్ చరణ్ గతంలో ఎప్పుడూ చేయని పాత్ర. ఇంత కాలం పూర్తి కమర్షియల్ సినిమాలకే పరిమితం అయిన ఈ మెగా హీరో తొలిసారి పూర్తి స్థాయిలో గ్రామీణ నేపథ్యంలో ఉన్న పాత్రలో చేశాడు. అందులో ఊరమాస్ గా కన్పిస్తూ..చెవిడివాడిగా నటిస్తూ అందరిలోనూ అంచనాలు పెంచేశాడు. సమంత కూడా అంతే. పూర్తి గ్రామీణ అమ్మాయిగా పాటల్లోనూ..మాటల్లోనూ ఓ కొత్తదనం చూపించి సినిమాకు ఓ క్రేజ్ తెచ్చింది. ఇన్ని భారీ అంచనాల మధ్య ‘రంగస్థలం’ సినిమా రానే వచ్చేసింది. రామ్ చరణ్ గత సినిమాలు బ్రూస్ లీ, ధృవలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాయి. రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో ఓ అతిధి పాత్ర పోషించినా అది పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. అయితే అక్కడ నిర్మాతగా మాత్రం సూపర్ సక్సెస్ సాధించాడు. మరి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిందా?. చూద్దాం.

ఇది 1980ల నాటి కథ అని సినిమా ప్రారంభంలోనే చెబుతారు. ‘రంగస్థలం’ గ్రామం వేదికగా జరిగే రాజకీయమే ఈ సినిమా. ఆ గ్రామంలో 30 ఏళ్ళుగా ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రెసిడెంట్ గా ఉంటూ... సొసైటీ పేరుతో ప్రజలను వేధించుకు తింటాడు. పది వేల రూపాయల రుణం తీసుకుంటే 20 వేల అంటూ గ్రామస్తుల వేసుకునే ప్రతి పంటను బలవంతంగా లాక్కోవటంతో పాటు...చివరకు పోలాలను కూడా చేజిక్కుంచుకుని అరాచకాలు చేస్తూ ఉంటాడు. అదే గ్రామంలో చిట్టిబాబు (రామ్ చరణ్) ఓ మోటార్ తో పొలాలకు నీరు పారిస్తూ జీవనం సాగిస్తుంటాడు. చిట్టిబాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ గ్రామానికి వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాలను అడ్డుకునేందుకు సర్పంచ్ బరిలోకి దిగుతాడు. అంతకు ముందు అలాగే సర్పంచ్ బరిలో దిగిన వారంతా హత్యకు గురవుతారు. మరి చిట్టిబాబు అన్న రంగస్థలం బరిలో సర్పంచ్ గా విజయం సాధిస్తాడా?. లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే.

ఓ రోజు ఊరిలో తిరుతూ రామలక్ష్మి (సమంత) తాటాకులతో కూడిన బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే..ఓ తడికె లాగేస్తాడు చిట్టిబాబు. అంతే చెడామడా తిట్టేస్తుంది రామలక్ష్మి. చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ కదా?. ఈ తిట్లేమి చెవికెక్కవు. అప్పటి నుంచి వాళ్ళ లవ్ ట్రాక్ సరదా సరదాగా సాగుతుంది. ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా, ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో రామ్ చరణ్ మంచి నటన కనపర్చాడు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె కెరీర్ లోనే ఓ మంచి సినిమాగా నిలిచిపోయేలా నటించింది. ఇంత కాలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన సమంత ఈ సినిమాలో మాత్రం తన పూర్తి స్థాయి నటనను ప్రదర్శించింది. అనసూయ ఈ సినిమాలో రంగమ్మత్తగా చాలా కీలక పాత్ర పోషించింది.

నెగిటివ్ షేడ్ ఉన్న సర్పంచ్ పాత్రలో నటించిన జగపతిబాబు తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే దర్శకుడు సుకుమార్ చాలా పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. గతంలో రావుగోపాలరావు..అల్లు రామలింగయ్యల సినిమాల నుంచే ఈ తరహా కథలను ప్రేక్షకులు చూశారు. కథ మరీ పాతది కావటం..సినిమా నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్ అంశాలుగా ఉన్నాయి. రంగస్థలం సినిమాలో పాటలు ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో పాటు క్లైమాక్స్ లో ట్విస్ట్ లు కూడా ఒకింత ఆసక్తిని కలిగిస్తాయి. ఓవరాల్ గా చూస్తే రంగస్థలం పాత సినిమాలను గుర్తుచేస్తుంది.

రేటింగ్. 3/5

Next Story
Share it