Telugu Gateway
Cinema

‘రంగస్థలం’ పాటపై వివాదం

‘రంగస్థలం’ పాటపై వివాదం
X

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమాపై ఓ వైపు అంచనాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఓ కొత్త వివాదం తలెత్తింది. ఓ పాటకు సంబంధించి కొత్తగా తలనొప్పి వచ్చిపడింది. అదీ సూపర్ డూపర్ హిట్ అయిన రంగమ్మ...మంగమ్మ పాటలో కావటం విశేషం. రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు అభిమానుల‌కు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 30న రంగస్థలం విడుదల చేయాలని నిర్ణయించిన తరుణంలో పాటను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలోని ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ... పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు’ అంటూ సాగే పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ అదరగొట్టాయి. రామ్ చరణ్ బనాయిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్స్‌ కూడా ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి.

అయితే ఈ సాంగ్‌లోగొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే అనే లిరిక్స్‌ యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని ఆల్‌ ఇండియా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పాటలోని ఆ చరణాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా విడుదలని అడ్డుకుంటామ‌ని హెచ్చరించారు. అంతకుముందు ఇలాగే అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో గుడిలో బడిలో పాటలో 'నమకం', 'చమకం' అనే రెండు పదాలని తొలగించాలని.. బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ వాటిని తొలగించింది. మరి రంగస్థలం యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it