జైట్లీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చిక్కుల్లో పడనున్నారా?. చూస్తుంటే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బి) కుంభకోణంపై అరుణ్ జైట్లీ ఎందుకు స్పందించటం లేదో తెలుసా?. అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అయితే దీనికి ఆధారం ప్రముఖ వెబ్ సైట్ దివైర్ ఇచ్చిన కథనం కావటం విశేషం. పీఎన్‌బీ స్కామ్ వెలుగుచూసే నెలరోజుల ముందుగా న్యాయవాది అయిన జైట్లీ కుమార్తెకు నిందితుడు నీరవ్ మోదీ భారీ మొత్తం చెల్లించినందునే ఆర్థిక మంత్రి మౌనం దాల్చారని రాహుల్ ఆరోపించారు. నిందితుడికి న్యాయసహాయం అందించే ఇతర లా సంస్థలపై సీబీఐ దాడులు చేపట్టినా జైట్లీ కుమార్తెపై ఎలాంటి చర్యలూ లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
పీఎన్‌బీ స్కామ్‌పై రాహుల్ మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ రూ 12,000 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిన క్రమంలో సీబీఐ, ఈడీలు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఈ కేసులో నీరవ్ బంధువు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నారు. నీరవ్ మోడీ సంస్థలకు న్యాయసహాయం అందించేందుకు అరుణ్ జైట్లీ కుమార్తె సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే కుంభకోణం వెలుగు చూసిన తర్వాత ఈ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు.