ఇది టీడీపీపై ‘మహాకుట్ర’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు ‘మహాకుట్ర’ జరుగుతోందని ఆరోపించారు. ఈ పథక రచనలో చాలామంది పెద్దలు ఉన్నారని పేర్కొన్నారు. స్థానికంగా ఈ కుట్రలో కొందరు భాగస్వాములు అయ్యారని తెలిపారు. అయితే ఈ కుట్రలో భాగస్వాములు అందరినీ ప్రజలు తిరస్కరిస్తారని, ఇలాంటి కుట్రలు ఎన్నింటిని తెలుగుదేశం పార్టీ సమర్ధంగా ఎదుర్కొందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలే రక్షకభటులు అని వ్యాఖ్యానించారు. పార్టీని,రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకుంటారు. పార్టీ ఎంపీలు..సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..‘లాలూచీ రాజకీయాలను ప్రజలు సహించరు. తెలుగుదేశం పార్టీపై కుట్రలను ప్రజలే తిప్పికొడతారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు అర్ధరహితం,ఆధార రహితం. గతంలో వైకాపా చేసిన పసలేని విమర్శలే పవన్ ఇప్పుడు చేస్తున్నారు. 2013నివేదిక పట్టుకుని అవినీతి రాష్ట్రం అనడం హాస్యాస్పదం.
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం,స్మగ్లింగ్ ను నియంత్రించాం. తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవవు. ఈ నాటకాల స్క్రిప్ట్ లు ఎక్కడనుంచి వచ్చాయో అందరికీ తెలిసిందే. ఎవరెవరు ఎన్ని నాటకాలు ఆడతారో ఆడనివ్వండి. చివరికి ప్రజలే సరైన తీర్పు ఇస్తారు. ఇది కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన కీలక సమయం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిఒక్కరూ పనిచేయాల్సిన తరుణం ఇలాంటి సమయంలో ఇటువంటి విమర్శలా...?టిడిపిని బలహీనపరిస్తే ఎవరికి లాభం..? ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికి ప్రయోజనం..?. ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా..?. రాష్ట్రానికి న్యాయం చేయాలని నేను కేంద్రాన్ని కోరితే వీరంతా నన్ను విమర్శించడం ఏమిటి..? ఒక కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కుట్రలో భాగంగానే నాపై,లోకేష్ పై నిందలు వేస్తున్నారు. దీనిని ప్రజలు అర్ధం చేసుకుంటారు.
ఇతరుల కుట్రలో పవన్ కళ్యాణ్ పావు కావడం బాధాకరం. లాలూచీ రాజకీయాలకు పవన్ తోడ్పాటు ఇవ్వడం దురదృష్టకరం. 5కోట్లమంది మన హక్కుల కోసం ముక్తకంఠంతో పోరాడాల్సిన సమయం ఇది. ఏవైనా విమర్శలుంటే ఎన్నికలప్పుడు చేయాలి, ఇప్పడు కాదు. మన లక్ష్యాన్ని మనవాళ్లే దెబ్బతీయడం బాధాకరం. బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రం హక్కుల కోసం పోరాడాలి. అంతేతప్ప ముఖ్యమంత్రిని బలహీన పరచడం తగదు. పవన్ కళ్యాణ్ పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా పవన్ పై విమర్శల దాడి పెంచారు.