Telugu Gateway
Top Stories

హోదా లేదు..ప్యాకేజీనే

హోదా లేదు..ప్యాకేజీనే
X

ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట. రాజకీయ ఉద్యమాల ఆధారంగా..సెంటిమెంట్ల ఆధారంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బిజెపి, టీడీపీల సంబంధాలు మరింత క్లిష్టతరంగా మారనున్నాయి. ఏపీ ప్రజలకు ఇష్టం లేకుండానే విభజన జరిగిందని, దాంతో వనరుల లేమితో రాష్ట్రం బాధపడుతోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోందని, పూర్తి స్థాయిలో వెనుకబడిన రాష్ట్రాలు అయినందునే వాటికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని, 14వ ఆర్థిక సంఘం ప్రకటన చేసేనాటికే వాటికి హోదా ఉందని చెప్పారు. అరుణ్‌జైట్లీ బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అయితే, రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది. రాష్ట్రాలకు 60:40 శాతం పద్ధతిలో రాష్ట్రాలకు నిధులు కేటాయించాలని చెప్పింది. అందుకే మేం హోదా ఇవ్వడం సాధ్యం కాక ప్యాకేజీ ఇచ్చాం. సెంటిమెంట్‌ ఆధారంగా నిధులు రావాలంటే రావు. ఫైనాన్స్‌ కమిషన్‌ చెప్పిన ప్రకారమే డబ్బులు వస్తాయి. కేంద్రం దగ్గర నిధులు కూడా లేవు. అయినా ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90శాతం నిధులు కేంద్రం, 10శాతం నిధులు రాష్ట్రాలు భరిస్తే సరిపోతుంది.

ప్రస్తుతం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేనందున 60:40శాతం నిధులు అమలు చేసుకోవాల్సింది. ఏపీకన్నా కూడా వెనుకబడిన రాష్ట్రాలు రాయితీలు కావాలంటే మేం ఏం చేయాలి. దేశం మొత్తాన్ని ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. ఇది రాష్ట్రాల యూనియన్‌. మేం నిధులు ఇవ్వం అని ఎక్కడా చెప్పలేదు.. ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా ప్రత్యేక హోదా లేకున్నా ఏపీకి 90:10 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఈఏపీ ద్వారానైనా నాబార్డు ద్వారానైనా ఇచ్చేందుకు సిద్ధం. అయితే, నాబార్డు ద్వారా అయితే ఏపీకి రెవెన్యూలోటు పెరుగుతుంది. రుణాలు తీసుకునే పరిమితి కూడా తగ్గుతుంది. ఎలా కావాలో ఏపీ తేల్చుకోవాలని అడిగితే నాబార్డు ద్వారా కావాలని చెప్పింది. నా బార్డుతో నిర్ణయించి మేం నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే పోలవరానికి రూ.5000 కోట్లు ఇచ్చాం. రాజధాని నిర్మాణానికి రూ.2500కోట్లు ఇచ్చాం. ఇక పన్ను రాయితీలను మేం ప్రవేశపెట్టిన తొలి రెండు బడ్జెట్‌ల్లోనే ఇచ్చేశాం. రెవెన్యూలోటు, కేంద్ర పథకాలకు 90శాతం నిధులు ఇచ్చే అంశాలు తేలితే మిగిలిన సమస్యలకు పరిష్కారం ఉంటుంది. హోదాకు సరిపడ రాయితీలన్నీ కూడా ఇస్తామంటున్నాం. 2013-14 బడ్జెట్‌లో రెవెన్యూలోటు కింద రూ.4000 కోట్లు ఇచ్చాం. మిగితా సంవత్సరాలకు లెక్కించాల్సి ఉంది. ఏప్రాతిపదికన రెవెన్యూలోటు లెక్కించాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి’ అని జైట్లీ తేల్చిచెప్పారు. హోదా విషయంలో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.

Next Story
Share it