Telugu Gateway
Andhra Pradesh

‘అవిశ్వాసం’లో కీలక మలుపు

‘అవిశ్వాసం’లో కీలక మలుపు
X

మోడీ సర్కారుపై అవిశ్వాసం వ్యవహారం శుక్రవారం నాడు కీలక మలుపు తిరిగింది. ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్షాలు అయిన టీడీపీ, వైసీపీలు వరసగా ప్రతి రోజూ ఇస్తున్న అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభలో టేకప్ చేయకపోవటంతో కాంగ్రెస్ కొత్త అస్త్రంతో రంగంలోకి దిగింది. సభ ఆర్డర్ లో లేనందునే తాను సభ్యులను లెక్కించలేకపోతున్నానని..సభ ఆర్డర్ లో ఉంటే తప్ప ..ఇది సాధ్యంకాదని చెబుతూ ప్రతి రోజూ వాయిదా వేస్తూ వెళుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగటం ఆసక్తికర పరిణామంగా మారింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వచ్చేవారం సభ జరిగే రోజు అంటే మార్చి 27 కోసం అవిశ్వాస తీర్మాన నోటీస్ అందజేశారు.

ఖర్గే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు. ఆయన వెంట వెంట మాజీ ఎంపీ జేడీ శీలం కూడా ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చాలా మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని జేడీ శీలం మీడియాతో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్‌ పోరాడుతూనేఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన పార్టీలతో పాటు నేరుగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగటంతో పరిణామాలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వచ్చే మంగళవారం ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it