Telugu Gateway
Telangana

కోదండరాం కొత్త పార్టీకి ఈసీ అనుమతి

కోదండరాం కొత్త పార్టీకి ఈసీ అనుమతి
X

తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడనుంది. జెఏసీ ఛైర్మన్ కోదండరాం పెట్టనున్న కొత్త పార్టీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ పార్టీ పేరు ‘తెలంగాణ జన సమితి’. తమ పార్టీకి అనుమతి లభించిన విషయాన్ని జెఏసీ వర్గాలు దృవీకరించాయి. ఈసీ అనుమతి లభించిన దరిమిలా పార్టీని అధికారికంగా జనం ముందుకు తెచ్చేందుకు టీజేఏసీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న కోదండరాం అధికారిక ప్రకటన చేస్తారని, ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని సమాచారం. తెలంగాణ జన సమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ నిర్ణయాలతో కోదండరాం తీవ్రంగా విభేదిస్తున్న విషయం తెలిసిందే.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయటంలేదని కోదండరాం పలు మార్లు బహిరంగంగా ప్రకటించారు. పలు నిరసన కార్యక్రమాలు కూడా తలపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే అణచివేతలు ఎక్కువగా ఉన్నాయని..పాలనలో ఎలాంటి మార్పులేదని ఆరోపించారు. కోదండరాం కొత్త పార్టీకి రంగం సిద్ధం కావటంతో అధికార పార్టీ నుంచి ఎవరైనా అటువైపు జంప్ అవుతారా?.కొత్త తరంతోనే పార్టీని ముందుకు తీసుకెళతారా?అన్న అంశం ఆసక్తికరంగా మారనుంది.

Next Story
Share it