Telugu Gateway
Telangana

కెసీఆర్ ఓ పది నిమిషాలు పక్క రాష్ట్రానికి సాయం చేయలేరా?

కెసీఆర్ ఓ పది నిమిషాలు పక్క రాష్ట్రానికి సాయం చేయలేరా?
X

ఓ పది నిమిషాలు పక్క రాష్ట్రానికి సాయం చేయలేని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు తెస్తారంటే ఎవరైనా నమ్ముతారా?. దేశ రాజకీయాలు అన్నీ మార్చేస్తానంటున్న కెసీఆర్ తన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకంత పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనే విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా ఇస్తారా?. ఇవ్వరా ఏదో ఒకటి తేల్చిచెప్పండి అని వ్యాఖ్యానించారు. లోక్ సభలో టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసం చర్చకు వస్తే ఆ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. కానీ అందుకు టీఆర్ఎస్ ఏ మాత్రం సహకరించటం లేదు. పైగా ఏపీపై రాజకీయంగా ఎదురుదాడి చేస్తోంది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే తరహా అందోళనలు చేస్తున్నా టీఆర్ఎస్ కు ఒనగూరిన ప్రయోజనం ఏమైనా ఉందా?. అంటే అదీ లేదు. అదే అవిశ్వాసం చర్చకు వస్తే ఇతర రాష్ట్రాల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చి...తెలంగాణలో మాత్రం ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించొచ్చు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రూలు ఉంటుందా?. ఇదేనా కేంద్రం తీరు అని కడిగేయవచ్చు. కెసీఆర్ కలలు కంటున్న థర్డ్ ఫ్రంట్ ఏజెండాను కూడా లోక్ సభ వేదికగా ఆ పార్టీ నేతలు చెప్పుకోవచ్చు. కానీ అందుకు టీఆర్ఎస్ ఏ మాత్రం సహకరించటం లేదు.

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల వైఖరి చూస్తుంటే కేంద్రంలోని మోడీ సర్కారును రక్షించేందుకే ఈ పని చేస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలపడుతున్నాయి. ఓ వైపు మోడీ ఏమీ చేయలేదని చెబుతూ..మరోవైపు రక్షణగా నిలవటం వెనక మతలబు ఏమి అయి ఉంటుందా? అన్న చర్చ సాగుతోంది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు స్వయంగా టీఆర్ఎస్ ఎంపీలను ఒక్క రోజు అయినా సహకరించాల్సిందిగా అభ్యర్థించారు. అయితే మమ్మల్ని అడిగి కేంద్రంలో చేరారా?. మమ్మల్ని అడిగి బయటకు వచ్చారా? అంటూ పొలిటికల్ ఎటాక్ చేశారో తప్ప...తాము సహకరించేదిలేదని తేల్చిచెప్పారు. పొరుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు ఉన్న ఏపీకి ధర్మబద్దంగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఏ మాత్రం సహకరించని కెసీఆర్ దేశంలో అందరికీ ఉపయోగపడే రాజకీయాలు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా?. విచిత్రం ఏమిటంటే ఈ విషయంలో సహకరించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి కెసీఆర్ తో మాట్లాడే అవకాశం ఉన్నా చేయటం లేదు. మరి ఈ కారణమేంటో?.

Next Story
Share it