Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ సర్కారు ఇష్టారాజ్యం

టీఆర్ఎస్ సర్కారు ఇష్టారాజ్యం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఓ సారి శాసనసభలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం తప్ప..మీరు చెప్పినట్లు చేస్తామా? అని ప్రశ్నించారు. కొత్త సెక్రటేరియట్ అంశంపై చర్చ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మా నిర్ణయాలు నచ్చకపోతే ప్రజలే నిర్ణయిస్తారు అని తేల్చేశారు. ఇప్పుడు అచ్చం అలాగే సాగుతోంది వ్యవహారం. పాలనతోపాటు అసెంబ్లీలోనూ సర్కారు అలాగే చేస్తోంది. గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటరెడ్డి వెంకటరెడ్డి పోడియం వైపు హెడ్ ఫోన్స్ విసిరేశారు. వెంకటరెడ్డి చర్యను ఎవరూ సమర్థించటం లేదు. కానీ సర్కారు ఈ సాకు చూపి ఏకంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సభలో మరీ అనుచితంగా ప్రవర్తించిన సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం సభకు ఉన్నా..అందుకు చాలా పద్దతులు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తొలి దశలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను శాసనసభాపక్ష నాయకులు అందరూ కలసి చూడటం ఒకటి. అందులో తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే..ఓ కమిటీ ఏర్పాటు చేసి..ఈ అంశం పరిశీలనకు అప్పగించటం. ఎథిక్స్ కమిటీకి నివేదించటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీపై రోజా సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించటంతోపాటు..ఇష్టానుసారం మాట్లాడారనే కారణంతోనే ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు కూడా ఓ కమిటీ వేసి...నివేదిక సభలో ప్రవేశపెట్టి...ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి తర్వాత చర్యలు తీసుకున్నారు. అంతకంటే ముందు ఆమెకు నోటీసులు జారీ చేసి..వివరణ కూడా తీసుకున్నారు. గతంలో టీడీపీ సభ్యుడు కరణం బలరాంపై చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రక్రియ అంతా ముందుకు సాగింది.

కానీ తెలంగాణ సర్కారు మాత్రం అవేమీ పట్టించుకోకుండానే..సభలో తీర్మానం పెట్టి...ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాల రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాదు..బడ్జెట్ సమావేశాల వంటి కీలక తరుణంలో ప్రధాన ప్రతిపక్షాన్ని ఏకంగా సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయటం సరైన చర్యకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు నోటీసులు ఇచ్చి..వారి వాదనలు విని తర్వాత చర్యలు తీసుకుంటే సభాసంప్రదాయాలను గౌరవించినట్లు ఉండేదని..కానీ అధికారపక్షం చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఫైళ్ళు నెలల తరబడి ముందుకు కదలవు కానీ..కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాల రద్దు విషయంలో మాత్రం ఖాళీ అయిన స్థానాల నోటిఫికేషన్..కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు పంపటం మాత్రం చకచకా సాగిపోయాయి. ఈ స్పీడ్ చూస్తుంటే ఇదంతా రాజకీయ కోణంలో సాగుతుందనే విషయం గ్రహించటం పెద్ద కష్టం కాబోదు. విపక్షాలు అన్నీ మొత్తం వీడియోలను బహిర్గతం చేయాలని కోరుతున్నా సర్కారు మాత్రం ఈ విషయంలో స్పందించటం లేదు.

Next Story
Share it