మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అత్యంత కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మే 12న రాష్ట్రమంతటా ఎన్నికలు జరగనున్నాయి. మే 15న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీపాట్ యంత్రాలు అమర్చనున్నట్లు ఈసీ ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. సీ ఫోర్స్ సంస్థ తాజాగా సర్వే చేసి వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ప్రకటించింది.
షెడ్యూల్ వెలువడేందుకు ఒక్క రోజు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాలు రాజకీయంగా మరింత హీట్ పెంచాయి. ఈ సర్వేను బిజెపి, జెడీఎస్ లు తప్పుపట్టాయి. అయితే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికలపై ఆ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మధ్యే లింగాయత్ లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి..బిజెపికి గట్టి షాక్ ఇచ్చారు. చూడాలి మరి ఈ రసవత్తర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో.