Telugu Gateway
Politics

ఇదేనా మీరు తెచ్చే గుణాత్మక మార్పు

ఇదేనా మీరు తెచ్చే గుణాత్మక మార్పు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెపి మరోసారి మండిపడింది. మాట ఇస్తే నిలబడాలి కెసీఆర్ నీతులు చెప్పటం విచిత్రంగా ఉందని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని, ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం.. ఇదేనా గుణాత్మక మార్పు? ఇంతకుముందు చెప్పిన ఒక్కమాటకైనా కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. 70 ఏళ్లుగా సాధ్యంకాని అభివృద్ధిని మోదీఈ 4 ఏళ్లలో చేసి చూపారు. అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు.

కేసీఆర్‌.. ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడున్న పార్టీలను పోగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా దేశప్రజలు ఎన్నో ఫ్రంట్లు చూశారు. సుస్థిరమైన నాయకత్వం కోసమే బీజేపీకి ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారు. కేసీఆర్‌లాంటి వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవు అని ఎద్దేవా చేశారు. వాపును చూసి బలుపుగా భ్రమిస్తున్న కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అనే గౌరవంలేకుండా మోదీని తిట్టారు. కేసీఆర్‌ పొరపాటున నోరుజారాడని వారి సంతానం కేటీఆర్‌, కవితలే అంగీకరించారు. ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. గత అసెంబ్లీలో కనీసం ఒక్క స్థానం కూడా లేని బీజేపీ త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ మాదే విజయం ’’ అని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it