Telugu Gateway

విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్

విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎవరికైనా దైవంతో సమానం అని..అలాంటిది వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ రాష్ట్రానికి న్యాయం చేయమంటే తనపై బురద జల్లుతారా అని మండిపడ్డారు. తల్లిదండ్రులను నిందించడం భారతీయ సాంప్రదాయమా? అని నిలదీశారు. ప్రధాని కాళ్లకు మొక్కడమే భారతీయ సాంప్రదాయమా? అని సీఎం ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

ఇటువంటి వాళ్లను ప్రధాని కార్యాలయం ఎలా చేరదీస్తుందన్నారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఐదు కోట్ల ప్రజల అజెండానే మన అజెండా అని ఎంపీలతో సీఎం అన్నారు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు కాపాడటం కన్నా ఏదీ ముఖ్యం కాదని తెలిపారు. లెక్కకు వీలుగా నీలిరంగు నంబర్ల కాగితాలతో ఎంపీలంతా నిలబడ్డారని... అయినా సభ వాయిదా వేయడం అప్రజాస్వామికమని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story
Share it