Telugu Gateway
Politics

ఏపీ టీడీపీలో చంద్రబాబు వ్యాఖ్యల కలకలం!

ఏపీ టీడీపీలో చంద్రబాబు వ్యాఖ్యల కలకలం!
X

ఒక్క మాటతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద కలకలమే రేపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు తప్పదని..అప్పటి పరిస్థితుల బట్టే పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే అంతిమంగా పొత్తు అధికార టీఆర్ఎస్ తోనే అనే సంకేతాలు పంపారు. తెలంగాణలో ప్రస్తుతం పోటీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతుందనే విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు తన వంతు ప్రయత్నం చేశారు. చాలా మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్న బిజెపి తెలంగాణలో తమకు పొత్తు ఉండబోదని తేల్చిచెప్పింది. సో ఇక మిగిలింది కాంగ్రెస్, టీఆర్ఎస్. చంద్రబాబు టీఆర్ఎస్ తో పొత్తుకే మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది ఏపీలో ఎక్కడ తమ కొంప ముంచుతుందో అన్న భయం టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఉద్యమ సమయంలో కెసీఆర్ మొదలుకుని ఆ పార్టీ నేతలు అందరూ చంద్రబాబుపై, ఏపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీని ఆంధ్రా పార్టీగా వ్యాఖ్యానించారు. అప్పట్లో ఏపీ ప్రజలపై తీవ్ర విమర్శలు చేసిన కెసీఆర్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఏపీ ప్రజలు దీన్ని హర్షిస్తారా?.

ఇఫ్పటికే తెలంగాణలో రకరకాల కారణాలతో పార్టీని సర్వనాశనం చేశారు..ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు ద్వారా ఏపీలో పార్టీకి కూడా చంద్రబాబు ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో పెద్ద కలకలమే రేపుతోంది. టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు వాస్తవరూపం దాలిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఏపీలో టీడీపీ అవకాశాలను దెబ్బతీయటం ఖాయం అని చెబుతున్నారు. సహజంగా ప్రత్యర్థుల గతంలో ఏపీ నేతలు..ప్రజలపై కెసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించటం ఖాయం అని..అది అంతిమంగా పార్టీకి ఎంతో కొంత నష్టం చేస్తుందే తప్ప..లాభం చేయదని భావిస్తున్నారు. చంద్రబాబు సహజ లక్షణానికి భిన్నంగా జీహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పై ఒక్కటంటే ఒక్క పరుషమైన విమర్శ కూడా చేయకుండా ‘సరెండర్’ రాజకీయాలు చేస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. తాజా పరిణామాలు టీడీపీలో ఎన్ని మార్పులకు కారణం అవుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it