Telugu Gateway
Movie reviews

‘తొలి ప్రేమ’ మూవీ రివ్యూ

‘తొలి ప్రేమ’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ యువ హీరోల్లో వరుణ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్. రొటీన్ సినిమాలు కాకుండా..కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకొస్తూ విజయాలు సాధిస్తున్నాడు. ఆ కోవలోనివే ముకుంద, కంచె, లోఫర్, ఫిదా సినిమాలు. వరుణ్ హీరోగా నటించిన ఫిదా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఫిదా అంతటి సక్సెస్ తర్వాత ఈ మెగా హీరో చేసిన సినిమానే ‘తొలి ప్రేమ’. శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలిప్రేమ వరుణ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇఛ్చిందో తెలియాలంటే మరింత ముందుకు సాగాల్సిందే. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఆదిత్య (వరుణ్ తేజ్‌) ఈ సినిమాలో కోపిష్టిగా కన్పిస్తాడు. ముందు విపరీతమైన కోపం ప్రదర్శించి తర్వాత...తాను చేసింది సరైనదా లేదా? అని ఆలోచిస్తుంటాడు.

ఓ రైలు ప్రయాణంలో పరిచయం అయిన వర్ష (రాశీఖన్నా)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వర్షకు కూడా ఆదిత్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ రైలు దిగేసరికి వర్ష కనిపించదు ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకదు. మూడు నెలల తరువాత ఆది జాయిన్ అయిన కాలేజ్‌ లోనే ఇంజనీరింగ్‌ చదవటానికి జాయిన్‌ అవుతుంది వర్ష. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కాలేజ్‌ లో జరిగి ఓ గొడవ మూలంగా ఆది, వర్షకు దూరంగా వెళ్లిపోతాడు. ఆరేళ్లకి మరోసారి ఆదిత్య జీవితంలోకి వర్ష ఎంటర్ అవుతుంది. లండన్‌ లో ఆదిత్య పనిచేసే కంపెనీలో సైట్‌ మేనేజర్‌గా వర్ష జాయిన్‌ అవుతుంది. అప్పటికీ వర్షను ద్వేషిస్తునే ఉంటాడు ఆది. ప్రేమించుకుని..గొడవ పడి విడిపోయిన వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ తరహా లవ్ స్టోరీలు చాలా వచ్చినా కథనంతో సినిమాను డిఫరెంట్ గా నడిపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రాశీ ఖన్నా టాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా తొలిప్రేమలో వర్ష పాత్ర ఆమెకు చిరకాలం గుర్తిండిపోయే పాత్రగా మిగలటం ఖాయం.

ఆమె నటన కూడా ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు పర్ పెక్ట్ గా సెట్ అయింది. యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. రొమాంటిక్ సీన్స్‌ లో రాశీఖన్నా నటనకు యూత్ ఆడియన్స్‌ ఫిదా అవుతారు. బెట్టింగ్ రాజు పాత్రలో హైపర్‌ ఆది తన మార్క్‌ పంచ్‌ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. సినిమా ఫస్టాఫ్ కాస్త వేగంగా ముందుకు సాగగా...సెకండాఫ్ మాత్రం స్లోగా కదిలినట్లు అన్పిస్తుంది. టేకింగ్ పరంగా సినిమాలో రిచ్ నెస్ కన్పిస్తుంది. జార్జ్‌ సీ విలియమ్స్‌ సినిమాటోగ్రఫి. కాలేజ్‌ సీన్స్‌, సాంగ్స్‌తో పాటు లండన్‌ లో జరిగే ఎపిసోడ్స్‌ ను చాలా అందంగా తెరకెక్కించాడు. ఓవరాల్ వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా.

రేటింగ్.3/5

Next Story
Share it