Telugu Gateway
Politics

‘పవన్’ డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ...బిజెపి!

‘పవన్’ డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ...బిజెపి!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ ను మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బిజెపిలు ఏ మాత్రం పట్టించుకోలేదు. నిజ నిర్థారణ కమిటీ ముందు పెట్టేందుకు ఆయన పిబ్రవరి 15వ తేదీలోగా తనకు ఏపీకి కేంద్రం చేసిన సాయానికి సంబంధించి లెక్కలు అందజేయాలని ఆయన బహిరంగంగా కోరారు. అయినా రెండు పార్టీలు చాలా లైట్ తీసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన పవన్ బిజెపి, టీడీపీ వాదనలు చూస్తుంటే ఎవరో ఒకరు తప్పు చేసినట్లు కనపడుతోందని వ్యాఖ్యానించారు. లెక్కలు ఇవ్వని ఏపీ సర్కారు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ చేసే ప్రయత్నం తప్పేమీకాదని...ఆయన ఏర్పాటు చేస్తున్న జెఏసీ కూడా మనకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించటం ద్వారా పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. అయితే లెక్కలు అడిగితే మాత్రం సున్నితంగా స్పందించాలని..శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరితే బెటర్ అని వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు స్పందించని వైనంపై పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

గతంలోనూ పోలవరంపై పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేయగా..ఏపీ సర్కారు చాలా లైట్ తీసుకుని వివరాలన్నీ నెట్ లో ఉన్నాయి చూసుకోమని సలహా ఇచ్చింది. అయితే నెట్ లో ఎలాంటి వివరాలు లేవని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన జెఏసీ..జెఎఫ్ సీ సమావేశం అయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ సమావేశానికి వామపక్షాల నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. మరి రెండు ప్రభుత్వాలు లెక్కలు ఇవ్వకపోవటంతో ఇప్పటివరకూ మీడియాలో వచ్చిన వాటితోనే చర్చలు సాగిస్తారా? లేక ఇతర మార్గాలు అన్వేషిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it