Telugu Gateway
Top Stories

శ్రీదేవి భౌతికకాయం తరలింపునకు లైన్ క్లియర్

శ్రీదేవి భౌతికకాయం తరలింపునకు లైన్ క్లియర్
X

సస్పెన్స్ వీడింది. శ్రీదేవి భౌతికకాయం తరలింపునకు మార్గం సుగమం అయింది. దీనికి అవసరమైన అనుమతి లభించింది. ఈ మేరకు ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ లేఖలను భారత రాయబార కార్యాలయంతో పాటు..శ్రీదేవి భర్త బోనీకపూర్ కు అందజేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. ఈ లేఖలు అందిన వెంటనే శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్‌ చేసి.. తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు సాగితే మంగళవారం రాత్రికి శ్రీదేవి భౌతికకాయం ముంబయ్ కు చేరుకునే అవకాశం ఉంది. తండ్రితో తోడుగా ఉండటానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ దుబాయ్‌ చేరుకున్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని దుబాయ్‌ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం తేల్చి న సంగతి తెలిసిందే.

సోమవారమే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేశారు. మంగళవారం పూర్తి ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేవరకు వేచిచూసి.. ఆతర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె తలకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉన్నదో తెలియాల్సి ఉంది. 54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా ఆమె భౌతికకాయం దుబాయ్‌ పోలీసుల అధీనంలోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్‌ పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం విచారణ జరిపాయి. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it