Telugu Gateway
Telugugateway Exclusives

అవినీతి నిరోధక చర్యలు...పీఎన్ బికి విజిలెన్స్ ఎక్స్ లెన్స్ అవార్డు

అవినీతి నిరోధక  చర్యలు...పీఎన్ బికి విజిలెన్స్ ఎక్స్ లెన్స్ అవార్డు
X

దేశంలో ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బి) కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. అలవోకగా..ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా వేల కోట్ల రూపాయల నిధులను లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ వోయు)ల రూపంలో నీరవ్ మోడీకి అందజేసింది. ఏ మాత్రం గ్యారంటీ లేకుండానే ఇలా వేల కోట్ల రూపాయల ఎల్ వోయుల జారీ చేశారు. ఇఫ్పుడు కుంభకోణం బద్దలవటంతో బ్యాంకులో కనీస జాగ్రత్తలు తీసుకోలేదనే విషయం అర్థం అవుతుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటం ఒకెత్తు అయితే..కావాలని కొంత మంది ఉన్నతాధికారులు దీనికి సహకరించారనేది మరో కోణం. పీఎన్ బిలో వ్యవహారాలు అంత అడ్డగోలుగా సాగుతుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ( సీవీసీ) కె వి చౌదరి పీఎన్ బికి ‘విజిలెన్స్ ఎక్స్ లెన్స్ అవార్డు’ అందజేశారు. 2016-17 సంవత్సరానికి గాను ఈ అవార్డు పీఎన్ బికి ఇచ్చారు. బ్యాంకు చీఫ్ విజిలెన్స్ అధికారి ఎస్ కె నాగపాల్ ఈ అవార్డు అందుకున్నారు. అది ఎందుకో తెలుసా?.

బ్యాంకులో అవినీతి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ), సీవీసీలు ఇచ్చిన మార్గదర్శకాలు పక్కాగా పాటిస్తున్నందుకు ఈ అవార్డు ఇచ్చారట. అంటే ఈ లెక్కన విజిలెన్స్ ఎక్స్ లెన్స్ అవార్డులు కూడా ఎంత బోగస్ ప్రమాణాలతో సాగుతున్నాయో అర్థం అవుతోంది. నిజంగా పీఎన్ బీకి విజిలెన్స్ అవార్డు ఇచ్చినట్లు ఈ బ్యాంకు అత్యంత ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు అయితే ఇంత భారీ ఎత్తున కుంభకోణం ఎలా చోటుచేసుకున్నట్లో. తాజా పరిణామాలతో బ్యాంకులనే కాదు.. ప్రతిష్టాత్మక సంస్థల విశ్వసనీయత కూడా ప్రమాదంలో పడేలా కన్పిస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఎనిమిదవ విజిలెన్స్ అధికారుల సదస్సులో ఈ అవార్డు ప్రధానం చేశారు.

Next Story
Share it