Telugu Gateway
Andhra Pradesh

‘రాజకీయం’ కోసం రాజధానిని ఆపేసిన చంద్రబాబు!

‘రాజకీయం’ కోసం రాజధానిని ఆపేసిన చంద్రబాబు!
X

నిజంగా మూడు భవనాల డిజైన్ల ఖరారుకు రెండున్నర సంవత్సరాలుపైగా పడుతుందా?. అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ పని చేసినా కూడా దాని వెనక ఓ పెద్ద ప్లానే ఉంటుంది. అది ఆర్థిక ప్రయోజనం అయినా కావచ్చు..లేదా అంత కంటే మెరుగైన రాజకీయ ప్రయోజనం అయినా కావొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన రాజధాని అమరావతి విషయంలో ఎందుకు విపరీతమైన జాప్యం జరుగుతోంది. అంటే ఖచ్చితంగా కావాలనే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ముందు సింగపూర్ కంపెనీలతో స్టార్టప్ ఏరియాలో అద్భుతమైన రెండు టవర్ల లాంటి భవనాలను నిర్మించి వాటిని చూపించి..మళ్లీ తాను గెలిస్తే తప్ప..అనుకున్న ప్రకారం రాజధాని ముందుకు సాగదని ప్రచారం చేయాలనేది చంద్రబాబు ఒరిజినల్ ప్లాన్. కానీ సింగపూర్ సంస్థలతో చేయించాలనే ఆ ప్లాన్ కాస్తా ప్రస్తుతానికి వికటించింది. ఇప్పుడు అవి అంత ఆగమేఘాలమీద కట్టడానికి రెడీగా లేవు. మరి రాజధానిలో కీలకం అయిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటివి అయినా కట్టోచ్చు కదా?. అవును ఈ సందేహం సరైనదే. అయితే ఇవి కట్టేస్తే పని అయిపోయినట్లే.

మరి రాజకీయం ఎలా నడపాలి?. అదీ చంద్రబాబు అసలు ప్లాన్. ఇప్పుడు అయితే కేంద్రం సహాయనిరాకరణ, ప్రతిపక్షాలు అడ్డుపుల్లలు...ఫిర్యాదులు, కోర్టు కేసుల కారణంగానే నిర్మాణాలు పూర్తి చేయలేకపోయానని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే రాజధాని ఇక్కడ నుంచి తరలిస్తారనే ప్రచారం చేసుకోవచ్చు. సో...గుంటూరు..కృష్ణా జిల్లాల్లో సాధ్యమైనన్ని సీట్లను గెలుచుకోవటం ద్వారా లబ్దిపొందాలనేది చంద్రబాబు ప్లాన్. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రం ఖచ్చితంగా విధిలేని పరిస్థితుల్లో అయినా చంద్రబాబుకే ఓటేయాల్సిన పరిస్థితి కల్పించటం ఒకెత్తు. ఇన్ని చేసినా రాజకీయ వాతావరణం అనుకూలిస్తుందా? అంటే అది చెప్పటం కష్టమే. ఎంత రాజకీయం చేసినా ఆ రెండు జిల్లాల్లో వందకు వంద శాతం సీట్లు దక్కించుకోవటం జరిగే పనికాదనే చెప్పొచ్చు. నిజంగా కట్టాలనుకుంటే రెండేళ్లలోనే రాజధానిలో కీలకం అయిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి శాశ్వత కట్టడాల పనులు పూర్తయ్యేవని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవుతుందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. దీనికితోడు బిజెపి వంటి పార్టీలు రాయలసీమ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నాయి. రాజధాని రాజకీయం చంద్రబాబుకు మేలు చేస్తుందా?. లేక నష్టం చేస్తుందా తెలియాలంటే ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే. అప్పటివరకూ ‘అమరావతి’ అలా ముందుకు ‘సాగు’తూనే ఉంటుంది. పట్టిసీమపై చూపించినంత కసి చంద్రబాబు అమరావతి విషయంలో ఎందుకు చూపించటం లేదన్నది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it