Telugu Gateway
Movie reviews

‘అ!’ మూవీ రివ్యూ

‘అ!’ మూవీ రివ్యూ
X

నాని. ఇంత కాలం వరస పెట్టి హిట్లు కొడుతున్న హీరోగానే టాలీవుడ్ కు పరిచయం. ఇప్పుడు నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘అ!’. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాడు ఈ సినిమా విడుదలైంది. మరి హీరోగా హిట్లు కొడుతున్న నాని..నిర్మాతగా కూడా హిట్టు అందుకున్నాడా?.. అసలు ఆ టైటిల్ పెట్టినప్పుడే ఇదేంటి? అనుకున్నారు అందరూ. అయితే సినిమా చూస్తే తప్ప...ఆ టైటిల్ అర్థం తెలియదు. ప్రతి సన్నివేశం ‘అ!’ అన్పించేలా ఉత్కంఠ రేపే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ సినీ ప్రేమికులకు ఆ సినిమా ఆకట్టుకోవటం ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. కొత్తదనం కోరుకునేవారికి మాత్రం ఈ సినిమా ఓ వినూత్న అనుభూతిని అందిస్తుంది. చెట్టు మాట్లాడటం ఏంటి?. చేప చెఫ్ గా వచ్చిన వ్యక్తికి వంట నేర్పటం ఏమిటి? అంతా వింతగా ఉంటుంది. ఈ సినిమా కథ అంతా కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీశర్మల చుట్టూనే తిరుగుతుంది. అదీ ఓ హోటల్ లో. ఈ సినిమాలో చెట్టుకు వాయిస్ ఓవర్ మాస్ మహారాజా రవితేజ ఇవ్వగా..చేపకు హీరో..సినీ నిర్మాత నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈషా రెబ్బా కృష్ణ అనే తన ప్రేమికుడిని ఓ హోటల్ లో తన తల్లితండ్రులకు పరిచయం చేసే సీన్..అక్కడ జరిగే పరిణామాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. సినిమా అంతా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ముందుకు సాగుతుంది. చిన్నతనంలో అమ్మాయిలపై జరిగే లైంగిక దాడులు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశాన్ని ఈ సినిమాలో చాలా సున్నితంగా చూపించారు. ‘అ!’ సినిమాలో రెగ్యులర్ సినిమాల్లో కన్పించే కామెడీ, ఫైట్లు, పాటలు కన్పించవు. ఇంత వరకూ తెలుగులో ఏ దర్శకుడు చేయని ప్రయోగం దర్శకుడు ప్రశాంత్ వర్మ చేశాడనే చెప్పాలి.

రేటింగ్. 3/5

Next Story
Share it