Telugu Gateway
Telangana

రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్

రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్
X

ఎవరేమి అన్నా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) షార్ట్ ఫిల్మ్ తో దుమారం రేపిన వర్మకు..తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. దీంతో భారత్ లో ఈ జీఎస్టీని ఉచితంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది. ఇండియాలో జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు ఈ షార్ట్ ఫిల్మ్ ప్రసార సంస్థ విమియా వెబ్‌సైట్‌ ప్రతినిధులు బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చిన నేపథ్యంలో ఇండియాలో జీఎస్టీ ఉచిత ప్రసారాలను నిలిపివేయాల్సిందిగా విమియో వెబ్‌సైట్‌ నిర్వాహకులకు, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

దీంతో స్పందించిన విమియో గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ ఉచిత ప్రసారాలను నిలిపేస్తున్నట్లు వెబ్‌సైట్‌ నిర్వాహకులు ప్రకటించారు. విమియో నిర్ణయాన్ని స్వాగతించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, 3డాలర్లు చెల్లించి వీక్షించే సదుపాయాన్ని సైతం రద్దు చేయాలని విమియో ప్రతినిధులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో వర్మ నిర్మించిన జీఎస్టీ చూడాలంటే అమెరికా, కెనడాలో 2.99 డాలర్లు, యూరప్‌లో 1.99 పౌండ్లు, భారత్‌లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాలి. ఇటీవలే విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ విజయవంతమైందని త్వరలోనే రెండో సిరీస్‌ను తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై వర్మ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it