సీఎం సీట్లో బాలకృష్ణ..సచివాలయంలో కలకలం
సీఎం సీట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇదేదో సినిమా వార్త అనుకుంటే మీరు పొరపడినట్లే. నిజంగా బాలయ్య సీఎం సీట్లో కూర్చున్నారు. ఏపీలో అన్నీ విచిత్రాలే. అందులో ఇదో ఓ విచిత్రం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీట్లో కూర్చున్నారు. అంతే కాదు సమీక్ష కూడా నిర్వహించారు. సహజంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తుంటే..మంత్రులు అందరూ హాజరవుతుంటారు. ఇందులో ఎలాంటి వింత ఉండదు. కానీ ఓ ఎమ్మెల్యే సమీక్ష చేస్తుంటే మంత్రులు హాజరయ్యారు. ఇదీ వెరైటీ. బాలకృష్ణ నిర్వహించిన సమీక్షలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రులను పక్క సీట్లో కూర్చోపెట్టి సమీక్ష నిర్వహించే వెసులుబాటు ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఉంటుందా?. లేక ఎమ్మెల్యేలు అందరికీ ఉంటుందా? అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు.
బాలకృష్ణ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వియ్యంకుడు, లోకేష్ కు మామ కావటంతోనే ఆయనకు ఈ ప్రత్యేక ఫెసిలిటీ. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశాలకు కూడా విలువ లేకుండా చేశారు. కేవలం మంత్రులు మాత్రం హాజరుకావాల్సిన సమావేశాల్లో పరకాల ప్రభాకర్, కుటుంబరావు వంటి వాళ్ళను కూడా కూర్చోపెట్టి మంత్రివర్గ ప్రతిష్టను దెబ్బతీశారు. ఇప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ వ్యవస్థలను మరో హైట్ కు తీసుకెళ్లారు. అనంతపురం జిల్లాలో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలపై ఈ సమావేశం నిర్వహించారు. మీడియాలో బాలకృష్ణ సీఎం సీట్లో కూర్చున్న వార్తలు రావటంతో ఆయన తర్వాత సీటు మారారు.