Telugu Gateway
Top Stories

హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ వెనక్కి

హెచ్ 1 బీ వీసాలపై ట్రంప్ వెనక్కి
X

ట్రంప్ ఒత్తిళ్ళకు తలొగ్గారు. అమెరికాలోని ఐటి కంపెనీలతో పాటు..అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో హెచ్ 1 బీ వీసాల్లో ప్రతిపాదించిన మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రివర్స్ గేర్ వేశారు. ఇది భారతీయ ఐటి కంపెనీలకు..నిరుద్యోగ యువతకు ఓ శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారు హాయిగా ముందుకు సాగిపోవచ్చు. ట్రంప్ ప్రతిపాదిత మార్పులు అమల్లోకి వస్తే లక్షలాది భారతీయులు అమెరికా నుంచి వెనక్కి రావాల్సి వచ్చేది. ప్రస్తుతానికి ఈ గండం లేనట్లే. హెచ్1బీ వీసాదారులకు పొడిగింపును రెండుసార్లకే పరిమితం చేయాలన్న ఆలోచనను ట్రంప్‌ ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. ట్రంప్‌ అమలులోకి తీసుకొచ్చిన ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌’ విధానాన్ని అనుసరిస్తూ.. హెచ్‌1బీ వీసాల పొడగింపు రెండు సార్లకే(6 సంవత్సరాలకే) పరిమితం చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) సోమవారం ఒక ప్రకటన చేసింది. తద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకున్న హెచ్1బీ వీసాలను ఎన్నిసార్లయినా పొడిగించుకోవడానికి విదేశీ ఉద్యోగులకున్న వెసులుబాటు యధావిధిగా కొనసాగనుంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇతర దేశాల సిబ్బందిని హెచ్1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ (ఉభయసభలు- సెనెట్, ప్రతినిధుల సభ) అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం చేసింది.

17 సంవత్సరాలుగా ఈ చట్టం అమల్లో ఉంది. గ్రీన్ కార్డ్ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను ‘ఎన్నిసార్లయినా పొడిగించే ’ అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది. అయితే కేవలం రెండుసార్లు మాత్రమే పొడగింపునకు అవకాశమిచ్చేలా చట్టంలో మార్పులు చేయాలని ట్రంప్‌ సర్కారు యత్నాలు ఆరంభించింది. ఈ ప్రతిపాదనలను పలువురు చట్టసభ్యులేకాక యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎస్‌సీసీ) సైతం వ్యతిరేకించింది. వీసా పొడగింపులపై ఆంక్షలు విధిస్తే ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థ అసలు లక్ష్యం నీరుగారిపోతుందని, ఎన్నో ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తూ, ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే ప్రతిభావంతులకు స్థానం లేదనడం ఏ మాత్రం సరైనది కాదని ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story
Share it