Telugu Gateway
Telangana

చంద్రబాబు వారం పేర్లు..గవర్నర్ సీఎంల పేర్లు మార్చేస్తున్నారు

చంద్రబాబు వారం పేర్లు..గవర్నర్ సీఎంల పేర్లు మార్చేస్తున్నారు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం వరకూ ‘సోమవారం’ పేరును ‘పోలవారం’గా మార్చేశారు. సోమవారాన్ని పోలవారం అంటే ప్రాజెక్టు పరుగులు పెడుతుందా? లేదా అన్నది వేరే విషయం. కానీ ఆయన మాత్రం ఆ ట్రెండ్ కంటిన్యూ చేశారు. ఇఫ్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా అదే బాటలో పయనించారు. ఆయన శనివారం నాడు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని...దేశంలోనే ఇది ఓ గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించారు. ఆయన అక్కడితో ఆగలేదు..ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరును కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మార్చాలని వ్యాఖ్యానించారు. అంతే కాదు..తాను అలాగే పిలుస్తా అన్నారు. సీఎం కెసీఆర్ విషయంలోనే కాదు...సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు పేరును కూడా కాళేశ్వరరావుగా పిలవాలని వ్యాఖ్యానించారు.

ఇలా గవర్నర్ సీఎం కెసీఆర్, మంత్రి హరీష్ రావుల పేర్లు మార్చేశారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ నరసింహన్, కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా గవర్నర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పనులపై సంతృప్తిని వ్యక్తం చేయటం..ప్రభుత్వంపై అభినందనలు కురిపించటం ఏ మాత్రం తప్పుకాకపోయినా...సీఎం కెసీఆర్, మంత్రి హరీష్ రావుల పేర్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు గవర్నర్ హోదాకు ఏ మాత్రం తగిన రీతిలో లేవని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story
Share it