Telugu Gateway
Politics

చంద్రబాబు ‘దావోస్’ పర్యటనలో పదే పదే అదే కంపెనీ

చంద్రబాబు ‘దావోస్’ పర్యటనలో పదే పదే అదే కంపెనీ
X

అది భాగస్వామ్య సదస్సు అయినా..దావోస్ సమావేశం అయినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ ఒక్కటే. పదే పదే అదే కంపెనీలతో ఎంవోయులు చేసుకుంటూ కోట్లాది రూపాయల పెట్టుబడులు సాధించినట్లు భ్రమింపచేయటం ఆయనకు అలవాటు. ఈ సారి కూడా అదే పని చేశారు. తాజాగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరమ్ కో కంపెనీ కృష్ణపట్నంలో భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తి చూపుతుందని ప్రకటించారు. ఈ వార్త బుధవారం నాటి పత్రికల్లో ప్రముఖంగానే వచ్చింది. అసలు విషయం ఏమిటంటే గత ఏడాది సరిగ్గా ఇదే జనవరి నెలలో కూడా దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇదే సంస్థకు చెందిన ప్రెసిడెంట్ అండ్ సీఈవో అమిన్ అల్ నసీర్ తో సమావేశం అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి ఆయన చాలా సానుకూలంగా స్పందించారని ఏడాది క్రితం కూడా సర్కారు ఇదే మాట చెప్పింది. అప్పుడు ప్రెసిడెంట్, సీఈవోతో సమావేశం అయిన చంద్రబాబు ఈ సారి అరామ్ కో వైస్ ప్రెసిడెంట్ సైదాల్ హద్రామీతో సమావేశం అయ్యారు.

పోయిన సంవత్సరం జనవరిలో ఇదే కంపెనీని ఆహ్వానించి..ఏడాది గడిచిన తర్వాత కూడా మళ్ళీ ఇదే కంపెనీని ఆహ్వానించటంలో అంతర్యం ఏమిటో చంద్రబాబు అండ్ కో కే తెలియాలి. సంవత్సరం అయిపోయింది కదా..ఎవరికి గుర్తు ఉంటుంది అనుకున్నట్లు ఉన్నారు పాపం...మళ్లీ ఇదో కొత్త పెట్టుబడి..దావోస్ లో చంద్రబాబు సాధించిన విజయం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే అదే కంపెనీ అయినా ఓకే. ఈ సారి అయినా కంపెనీ ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడితే ఆహ్వానించాల్సిందే. భాగస్వామ్య సదస్సులోనూ చంద్రబాబు ఇదే తరహా ఎంవోయులు కుప్పలుతెప్పలు చేసుకున్నారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నాయో తెలియదు కానీ మళ్ళీ మరోసారి సదస్సుకు రెడీ అయిపోతున్నారు చంద్రబాబు.

Next Story
Share it