Telugu Gateway
Movie reviews

‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ

‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ
X

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే అంచనాలు పీక్ కు వెళతాయి. అది ఎందుకో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన అత్తారింటికి దారేది సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన సినిమాలు అ..ఆ..సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్రివిక్రమ్ కొత్త సినిమా…అదీ పవన్ కళ్యాణ్ తో అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అందునా ఇది పవన్ కళ్యాణ్ 25వ సినిమా కూడా కావటం విశేషం. భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ నటించారు.

ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఏబీ గ్రూప్ అథినేత గోవింద భార్గవ్ తో(బొమన్ ఇరానీ)పాటు అతడి వారసుడిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి బాలసుబ్రహ్మణ్యం (పవన్ కళ్యాణ్ ) అనే వ్యక్తిని తీసుకువస్తుంది. ఏబీ గ్రూప్ లో తొలుత ఆఫీస్ అసిస్టెంట్ గా చేరిన బాలసుబ్రహ్మణ్యం తర్వాత అంచలంచెలుగా సీఈవోగా ఎదుగుతాడు. బాలసుబ్రమణ్యం అభిషిక్త్ భార్గవగా ఎలా మారాడు. ఇది ఎలా సాద్యం అన్నది వెండితెర మీద చూడాల్సిందే. ఏపీ గ్రూపులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి గోవింద భార్గవ్ ను, అతడి వారసుడి హత్యకు కారణాలను అన్వేషించటం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆఫీసు కేంద్రంగా జరిగే సన్నివేశాలు కొన్ని మాత్రం రక్తికట్టిస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తన పాత్రకు న్యాయం చేసినా కథలో సత్తా లేకపోవటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. సినిమా అంతా ఫస్టాఫ్ చాలా స్లోగా కదులుతుంది. ఓ మాటలో చెప్పాలంటే ప్రేక్షకుడి సహనానికి పరీక్షలాంటిదే. సెకండాఫ్ కొంతలో కొంత వేగంగా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ ఉన్నా వారి పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. పైగా వారిద్దరి మధ్య పెట్టిన ఓ ఫైటింగ్ సీన్ సినిమా స్థాయిని దిగజార్చిందని చెప్పొచ్చు.

కుష్భూ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ సవతి తల్లి పాత్రలో కుష్భూ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆది పినిశెట్టి కూడా తనకు అలవాటైన స్టైలిష్ విలన్ పాత్ర కావటంతో అలవోకగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రావు రమేష్, మురళీశర్మ పాత్రలు. వారిద్దరి కాంబినేషనే సినిమాలో కాస్త రిలీఫ్. అజ్ఞాతవాసిలో చాలా చోట్ల అత్తారింటికి దారేది సినిమా ఛాయలు కన్పిస్తాయి. పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన కొడకా..కోటేశ్వరరావు పాట కూడా లేకపోతే సినిమా మరింత డల్ గా ఉండేది. ఓవరాల్ గా చూస్తే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ రేంజ్ సినిమా కాదు. ఓ సాదా సీదా సినిమా మాత్రమే.

రేటింగ్. 2.5/5

Next Story
Share it