నాయకుడు నడిపిస్తాడా...నాయకుడిని నడిపించాలా!
నాయకుడు ప్రజలను నడిపించాలా?. ప్రజలు నాయకుడిని నడిపించాలా?. సహజంగా నాయకుడే ప్రజల్లో స్పూర్తి నింపి..మార్గనిర్దేశం చేయాలి. అలాంటి వాళ్లకే నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటారు. కానీ అదేమి విచిత్రమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మీరు వస్తానంటేనే...నేను వస్తా అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, యువత సిద్ధంగా ఉన్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికార టీడీపీ అసలు ప్రత్యేక హోదానే అక్కర్లేదు..దాని కంటే ప్రత్యేక ప్యాకేజీనే బెటర్..అందుకే ప్యాకేజీకి అంగీకరించాం అని చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని..మంత్రులు అందరూ ఇదే పాట పాడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ జూన్ కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తమ ఎంపీలు అందరూ రాజీనామా చేసి..దేశంలోనే సంచలనం సృష్టిస్తామని ప్రకటించారు. హోదా అక్కర్లేదు..ప్యాకేజీ చాలు అని టీడీపీ వాదిస్తుంది. అదే వైసీపీ దగ్గరకు వచ్చేసరికి హోదా కోసం మీ రాజీనామాలు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తుంది.
అసలు టీడీపీకే ప్రత్యేక హోదా కావాలా? వద్దా అనే అంశంపై క్లారిటీ లేనట్లుంది. రాజీనామాలు చేయలేదు కాబట్టి జగన్ ను ఫిక్స్ చేయాలనే ప్లాన్ అది. జగన్ కూడా రాజీనామాల విషయంలో వెనక్కు తగ్గి మాట తప్పను..మడప తిప్పను అనే డైలాగును మర్చిపోయారు. ప్రత్యేక హోదా పోరాడి సాధిస్తానని గతంలో ప్రకటించిన పవన్...ప్యాకేజీ పాచిపోయిన లడ్లు అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన బిజెపి నేతలు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు...పోరాటానికి వైసీపీ, టీడీపీ మద్దతు కోరటం విచిత్రంగా ఉంది. జనసేనకు అంటూ ఓ సిద్ధాంతం లేదా?. రాజకీయ మార్గం లేదా?. పవన్ కళ్యాణ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన పిలుపిస్తే వేలాది మంది యువత ఏమీ ఆశించకుండానే ముందుకొస్తారు. పవన్ లాంటి వ్యక్తి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు..యువతకు వివరిస్తే అతి పెద్ద కష్టం కాబోదు. హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరిస్తే సహజంగానే వాళ్లు ఈ ఉద్యమం వైపు ఆకర్షితులవుతారు. అలాంటిది పవన్ చేయాల్సిన పనిచేయకుండా...ఇతరుల సాయం కోరటంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.